ఆయన ఉద్యమ నేస్తం. ఎర్రెర్రని జెండా ఆయన భావజాలపు అజెండా. పతితులు, భ్రష్టులు, బాధాసర్పదష్టుల జీవితాలు ఆయన చిత్రాల ఇతివృత్తాలు. అధోజగత్ ప్రపంచపు గుండె తడిమి, కన్నీరు తుడిచే మానవీయ కోణం ఆయన వ్యాపకం. సమాజంలో సమకాలీన సమస్యలపై ఎలుగెత్తి నినదించిన విప్లవ శంఖారావం ఆయన గుండె చప్పుడు. నిరాడంబరత ఆయన జీవన శైలి. ఎటువంటి భేషజాలు లేకుండా నలుగురితో కలిసి పోవడమే ఆయన ప్రవృత్తి. ఎదురైనా ప్రతి ఒక్కరిని అక్కున చేర్చుకుని ఆత్మీయత పంచే ఆయన తెలుగు సినీపరిశ్రమలో అజాత శత్రువు. ఆయనే.. ఆర్.నారాయణ మూర్తి. ఉద్యమ శక్తులకు స్ఫూర్తి. విప్లవ చిత్రాల చిరస్థాయి కీర్తి. గురువారం(డిసెంబరు 31)ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా నారాయణ మూర్తి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు.
బహుముఖ ప్రజ్ఞ
ఆర్.నారాయణ మూర్తి కేవలం నటుడిగానే కాకుండా స్క్రీన్ రైటర్‌గా, దర్శకుడిగా, గాయకుడిగా, డాన్సర్‌గా, నిర్మాతగా తెలుగు సినిమా పరిశ్రమకు సేవలు అందిస్తున్నారు. సొంత చిత్ర నిర్మాణ సంస్థ స్నేహ చిత్ర పిక్చర్స్ ఉంది. సమాజంలో దిగువ శ్రేణిని ఉన్నత వర్గాలు ఎలా దోపిడీ చేస్తారో బహిర్గతం చేసే సమాంతర చిత్రాలను తెరకెక్కించి వాటి ద్వారా ఈయన ప్రసిద్ధి చెందారు. నిరుద్యోగం, ప్రపంచ బ్యాంకు పాలసీలు, అభివృద్ధి చెందుతున్న దేశాలలో సమస్యలు, పర్యావరణ సమస్యలు, ఆనకట్టలు, పునరావాస సమస్యలు, భూ సమస్యలు, రాజకీయ గందరగోళం లాంటి సమకాలీన సామాజిక సమస్యలే ప్రధాన అంశాలుగా ఈయన సినిమాలు తీస్తుంటారు. ఆయన చిత్రాల పేర్లు కూడా విప్లవ సంకేతాలు. 'అర్ధరాత్రి స్వతంత్య్రం', అడవి దివిటీలు, లాల్ సలాం, దండోరా, ఎర్ర సైన్యం, చీమల దండు, దళం, చీకటి సూర్యుడు, ఊరు మనదిరా, వేగు చుక్కలు లాంటి సినిమాలే అందుకు ఉదాహరణలు.
స్వస్థలం గోదావరి ప్రాంతం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో రౌతులపూడి మండలంలో మల్లంపేట గ్రామంలో ఈయన జన్మించారు. వీరిది పేద రైతు కుటుంబం. తండ్రి పేరు రెడ్డి చిన్నయ్య నాయడు, తల్లి పేరు రెడ్డి చిన్నమ్మ. ఈ గ్రామంలోనే ఐదో తరగతి వరకు ఆర్.నారాయణ మూర్తి చదువు సాగింది. ఆ తరువాత శంఖవరం పాఠశాలలో విద్యనభ్యసించారు. రౌతులపూడిలో నారాయణ మూర్తి కుటుంబానికి ఓ సినిమా థియేటర్ ఉంది. ఈయనకు బాల్యం నుంచే సినిమాలపై ఆసక్తి ఉండేది. ఎక్కువగా ఎన్టీఆర్, నాగేశ్వరరావుల సినిమాలు చూసే నారాయణ మూర్తి.. వాళ్లను అనుకరించేవారు కూడా.
విద్యార్థి దశనుంచి నాయకత్వ లక్షణాలు
పెద్దాపురంలో ఎస్.ఆర్.వి.బి.ఎస్.జె.బి.మహారాణి కళాశాలలో బి.ఏ చదువుతున్నప్పుడు రాజకీయాలు, సినిమాలకు ప్రభావితులయ్యారు. ఆయన చదువుతోన్న కళాశాల విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు. అలాగే అదే కళాశాలలో లలిత కళల విభాగానికి కూడా కార్యదర్శిగా వ్యవహరించారు. ఇంకా తాను నివాసముంటున్న ప్రభుత్వ హాస్టలుకు కూడా విద్యార్థి అధ్యక్షునిగా ఉన్నారు. పేద విద్యార్థులకు సంబంధించిన నిధి సంఘానికి కూడా కార్యదర్శిగా సేవలు అందించారు. పట్టణ రిక్షా సంఘానికి కూడా ఆర్.నారాయణ మూర్తి అధ్యక్షుడిగా పనిచేశారు. దాంతో, స్థానిక రిక్షా కార్మికులు మద్దతు కోసం ఈయన్ను సంప్రదించేవారు. ఒకసారి బీహార్‌లో వరద సహాయానికి తన వంతు కృషి చేశారు. కళాశాలలో నారాయణ మూర్తిని సహ విద్యార్థులు 'అన్న' అని పిలిచేవారు.
170 మంది జూనియర్ ఆర్టిస్టుల్లో ఒకడిగా
నారాయణమూర్తికి చిత్రాల్లో హీరోగా నటించాలని ఉండేది. అందుకోసం ఇంటర్మీడియేట్ పరీక్షలు పూర్తయిన తరువాత మద్రాస్ వెళ్లిపోయారు. అయితే, ఇంటర్మీడియేట్ పరీక్షలలో తాను ఫెయిల్ అవుతానని అనుకొని మద్రాస్ వెళ్లారు నారాయణ మూర్తి. 17, 18 వయసులో మద్రాస్‌లో తిండి, వసతి అనేక కష్టాలు పడుతోన్న సమయంలో ఒకసారి తాను ఇంటర్మీడియేట్ పరీక్షల్లో పాస్ అయినట్టు తెలిసింది. అదేసమయంలో అనుకోకుండా నేరము శిక్ష సినిమాలో రాముని బంటుని రా అనే పాటలో 170 మంది జూనియర్ ఆర్టిష్టులలో ఒకరిగా నటించే అవకాశం లభించింది నారాయణ మూర్తికి.
ఎన్టీఆర్ స్పూర్తితో బి.ఏ పూర్తి
ఆ పాత్రలో చేసినప్పటికీ, అంత చిన్న పాత్ర అవడం వల్ల నారాయణ మూర్తి ఎంతో నిరుత్సాహపడ్డారు. ఎలాగో ఇంటర్మీడియేట్ పరీక్ష పాస్ అయినట్టు తెలిసింది. కాబట్టి డిగ్రీ చదువు పూర్తి చేసి రమ్మని దాసరినారాయణ రావు నారాయణ మూర్తికి సలహా ఇచ్చారు. సహజంగా ఎన్టీఆర్‌ను ఇష్టపడే నారాయణమూర్తి సినిమా టైటిల్స్ వేసేటప్పుడు ఎన్టీఆర్ పేరు పక్కన బి.ఏ అనే అక్షరాలు చూసి తాను బి.ఏ. చదవాలని ఆశపడ్డారు. అలా బి.ఏ. చదవడానికి తూర్పు గోదావరికి నారాయణమూర్తి వచ్చిన సమయంలోనే నేరము శిక్ష సినిమా రిలీజ్ అయింది. అందులో 170 జూనియర్ ఆర్టిస్టులలో ఒక చిన్న పాత్ర చేసినప్పటికీ ఆయన ఊరి ప్రజలు నారాయణమూర్తి సన్నివేశాలు వచ్చినప్పుడు గుర్తుపట్టి మరీ ఈలలూ, చప్పట్లు కొట్టేవారు. అలా గుర్తింపు తెచ్చుకొన్న కారణంగా నారాయణమూర్తి డిగ్రీ పూర్తి చేసిన తరువాత చిత్రాల్లో నటించాలని అప్పుడే నిర్ణయించుకొన్నారు. బి.ఏ. చదువుకుంటున్నప్పుడు ఒకపక్క కళాశాల సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటూనే మరోపక్క కమ్యూనిస్టు పుస్తకాలూ బాగా చదువుకునేవారు. కళాశాలలో హీరోయిన్ మంజుల నృత్య కార్యక్రమం ఏర్పాటు చేసే పనిలో ఒక ముఖ్య పాత్రను పోషించారు. బి.ఏ. అయిన తరువాత మద్రాస్‌కు వెళ్లిపోయారు.
షూటింగ్ ఉన్నప్పుడే భోజనం