'నేరము శిక్ష' సినిమాతో సినీరంగ ప్రవేశం చేసి.. 'నీడ' చిత్రంతో హీరోగా ఎదిగి, ఆ తర్వాత 'చీమల దండు', 'ఎర్రసైన్యం' వంటి ఎన్నో సూపర్‌హిట్ సినిమాలకు నిర్మాతగా, రచయతగా, దర్శకుడిగానే కాక సినీ ఇండస్ట్రీకి ఆయన ఒక మార్గదర్శకులు అయ్యారు. 'సెల్యూలాయిడ్ లాల్ జెండా'గా పేరొందిన ఆర్. నారాయణ మూర్తి(R. Narayana Murthy).. ఈటీవీలో ప్రసారమవుతున్న 'చెప్పాలనిఉంది' కార్యక్రమానికి(Cheppalani Vundi Etv) ఈ వారం ముఖ్యఅతిథిగా విచ్చేసి, తన సినీ ప్రయాణంతో సహా వ్యక్తిగత విశేషాలను పంచుకున్నారు.
సినిమా ఓ పవర్ఫుల్ మీడియా
నటనపై ఉన్న ఆసక్తితోనే చిత్రపరిశ్రమలో అడుగుపెట్టినట్లు ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి అన్నారు. సినిమా అనేది పవర్ఫుల్ మీడియా అని.. ప్రపంచాన్నే మార్చే శక్తి సినిమాలకు ఉన్నట్లు ఓ మహానుభావుడు చెప్పారని తెలిపారు. కళాశాలలో చదివే రోజుల నుంచే అటు అనేక ఉద్యమాల్లో పాల్గొంటూ.. ఇటు సినిమాలపై ఆసక్తిని కొనసాగించినట్లు నారాయణ మూర్తి చెప్పారు. పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ చేసినా.. సినిమాల్లో హీరోగా చేయాలనే ఆసక్తితో చెన్నైకి వెళ్లినట్లు వెల్లడించారు. అలా నటనతో పాటు ఉద్యమ భావాలను వెండితెరపై ప్రస్పుటించేలా సినిమాలను రూపొందించినట్లు నారాయణ మూర్తి పేర్కొన్నారు.
అభిమాన హీరోహీరోయిన్లు..
అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి తన అభిమాన నటీనటులని అన్నారు ఆర్.నారాయణ మూర్తి. వీరితో పాటు ఎన్టీఆర్, రేలంగి, ఎస్వీ రంగారావు, సూర్యకాంతం ఉన్న సినిమాలను అసలు చూడకుండా ఉండలేనని తెలిపారు. ఎస్వీ రంగారావు తెలుగు పరిశ్రమలో కాకుండా మరే ఇతర చిత్రసీమలో పుట్టినా.. ఆయనకు ఇదే గౌరవం లభించేదని, అంతటి మహనీయుడు ఎస్వీ రంగారావు అని నారాయణ మూర్తి పేర్కొన్నారు.