'సెట్లో ఎవరైనా జోక్ వేసినా నవ్వేదాన్ని కాదు. పాత్ర కోసం అంత తీక్షణతో పనిచేశా' అన్నారు గీత్ సైని. 'పుష్పక విమానం'(Pushpaka vimanam release date) చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతున్న మరో కథానాయిక ఈమె. ఇందులో కథానాయకుడి భార్య మీనాక్షిగా నటించింది. ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా శుక్రవారం(నవంబర్ 12) ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా గీత్ సైని చిత్రం గురించి, తన నేపథ్యం గురించి బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది.
"చిట్టిలంక సుందర్ భార్య మీనాక్షిగా నేను నటించా. నా పాత్ర సినిమాకు చాలా కీలకం. పెళ్లయ్యాక ఇంట్లో నుంచి వెళ్లిపోతాను. ఎక్కడికి వెళ్లాను? అలా వెళ్లిపోవడానికి కారణమేమిటనేది సినిమా చూసి తెలుసుకోవల్సిందే. మీనాక్షి పాత్ర సులువేం కాదు. కెరీర్ ఆరంభంలోనే ఇంత బలమైన పాత్రను సవాల్‌గా తీసుకుని పనిచేశా. పాత్ర కోసం ఎప్పుడూ ఒకే మూడ్‌లో ఉండాల్సి వచ్చింది. అందుకే సెట్లో నా చుట్టుపక్కల జరిగే విషయాల గురించి అస్సలు పట్టించుకునేదాన్ని కాదు. మీనాక్షి పాత్రలో నేను చాలా భిన్నంగా కనిపిస్తా. మీనాక్షి కోసం నేనెంతగా కష్టపడ్డానో సినిమా చూశాక ప్రేక్షకులు అదే స్థాయిలో నా పాత్రని ఇష్టపడతారు" అని తెలిపింది గీత్ సైని.