విజయవంతమైన సినిమాకు కొనసాగింపుగా మరో చిత్రాన్ని పట్టాలెక్కించడం కొత్తేమీ కాదు. ఎప్పట్నుంచో ఆ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే తెలుగులో విజయవంతమైన కొనసాగింపు చిత్రాలు తక్కువే. తొలి భాగానికి దీటుగా తెరకెక్కించలేకపోవడం.. ప్రేక్షకుల్లో అంచనాలు ఎక్కువగా పెరిగిపోవడం తదితర కారణాలతో చాలా సినిమాలు పరాజయాల్నే చవిచూశాయి. 'రక్తచరిత్ర', 'బాహుబలి: ది కన్‌క్లూజన్' తదితర చిత్రాల తర్వాత కొనసాగింపు చిత్రాలపై చిత్రసీమకు బాగా గురి ఏర్పడింది. కథ కాస్త పెద్దదిగా అనిపించిందంటే, రెండు భాగాలుగా చెప్పేద్దాం అన్న ధోరణిలో ఆలోచిస్తుంటారు దర్శకనిర్మాతలు. ఈమధ్య ఓ ఇద్దరు దర్శకులు మూడు భాగాలుగా తీయాలని కథల్ని సిద్ధం చేసుకున్నారంటే సీక్వెల్ సినిమాపై ఏర్పడిన గురి ఏపాటిదో స్పష్టమవుతోంది. మూడు భాగాల చిత్రాల సంగతేమో కానీ.. ఈ ఏడాదిలో రెండో భాగంగా వస్తున్నవి ప్రేక్షకుల్ని ఊరిస్తున్నాయి.
కాదు కానీ...
ఎక్కడ ఆగిందో, అక్కడి నుంచి మళ్లీ కథ మొదలైందంటే... వాటినే కొనసాగింపు చిత్రాలు అంటారు. ఇప్పుడు ఆ లెక్కలు మారాయి. కథలతో సంబంధం లేకుండా పాత్రల్ని కొనసాగించినా వాటిని కొనసాగింపు చిత్రాల్లానే చూస్తోంది చిత్రసీమ. ప్రేక్షకులు కూడా తొలి భాగం సినిమాని దృష్టిలో పెట్టుకునే థియేటర్లకొస్తుంటారు. విజయవంతమైన 'ఎఫ్2' తర్వాత వెంకటేష్, వరుణ్‌తేజ్ కథానాయకులుగా 'ఎఫ్3' తెరకెక్కుతోంది. అయితే ఈ రెండు చిత్రాల్లోని కథలు వేర్వేరు. తొలి సినిమాలో కనిపించిన ఫన్, ఫ్రస్ట్రేషన్.. నాయకానాయికల పాత్రలే రెండో సినిమాలో ఉంటాయని, ఇందులో కథ డబ్బు చుట్టూ తిరుగుతుందని దర్శకుడు అనిల్ రావిపూడి చెబుతున్నారు. 'బంగార్రాజు' కొనసాగింపు చిత్రమేమీ కాదు. 'సోగ్గాడే చిన్నినాయనా'కి ముందు భాగంగా రూపొందుతోంది. కానీ సీక్వెల్ సినిమా తరహాలోనే ప్రేక్షకులు, మార్కెట్ వర్గాలు ఈ సినిమాని చూస్తున్నాయి. కథేమిటనేది పక్కనపెడితే తొలి సినిమాని మనసులో పెట్టుకునే వీటికి వస్తారనడంలో సందేహం లేదు.
'పుష్ప' రెండో భాగం