Pushpa 2 script: 'సెకండ్ ఇంటర్వెల్' అంటూ 'పుష్ప: ది రైజ్' చివర్లో ఎండ్‌కార్డు వేసి ఆసక్తిని రేకెత్తించారు దర్శకుడు సుకుమార్. సాధారణ కూలీగా జీవితం మొదలు పెట్టిన పుష్పరాజ్ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎర్రచందనం సిండికేట్‌కు నాయకుడెలా అయ్యాడో ఇందులో చూపించారు. 'పుష్ప: ది రూల్'లో మొదటి భాగానికి మించి యాక్షన్ డ్రామా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన 'పుష్ప-1'కు హిందీ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ క్రమంలో వారిని కూడా దృష్టిలో పెట్టుకుని రెండో భాగం స్క్రిప్ట్‌లో చిన్న చిన్న మార్పులు చేయనున్నారట దర్శకుడు సుకుమార్. తొలుత అనుకున్న దాని ప్రకారం కాకుండా, హిందీ ప్రేక్షకులను కూడా మెప్పించే విధంగా ఆ మార్పులు ఉంటాయట.
అయితే, 'పార్ట్-2' కోసం హిందీ నటులను కూడా రంగంలోకి దింపనున్నట్లు వినిపిస్తున్న టాక్‌ను మాత్రం చిత్ర బృందం తోసిపుచ్చుతోంది. పాన్ ఇండియా హీరోగా అల్లు అర్జున్ స్టార్‌డమ్ సరిపోతుందని భావిస్తోంది. దీంతో పాటు, రెండో భాగంలో పుష్పతో ఢీ అంటే ఢీ అనేలా ఫహద్ ఫాజిల్ పాత్ర ఉంటుందట. తనని అవమానించిన పుష్పరాజ్‌పై పగ తీర్చుకునేందుకు భన్వర్‌సింగ్ వేసే ఎత్తులు, వాటి వల్ల పుష్ప పడే ఇబ్బందులు భావోద్వేగంతో సాగుతాయని అంటున్నారు.