తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'చిరు ట్వీట్​తో నా చెంప పగిలింది' - tollywood latest updates

మెగాస్టార్ చిరంజీవి చేసిన ఓ ట్వీట్ కారణంగా తన చెంప పగిలిందని చెప్పుకొచ్చారు టాలీవుడ్ అగ్ర దర్శకుడు పూరి జగన్నాథ్​. ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్​ గురించి తన శైలిలో స్పందించారు. 'ఈనాడు'తో ముఖాముఖిలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

puri said he slapped by chiru tweet
చిరు ట్వీట్​ చేస్తే పూరి చెంప పగిలింది!

By

Published : Apr 1, 2020, 7:16 AM IST

కరోనా... కరోనా... ప్రపంచమంతా ఇప్పుడు ఈ ఫీవరే. మనిషి ప్రకృతికి విరుద్ధంగా బతుకుతున్నాడని... అందుకే ఇలాంటి వైపరీత్యాలని చెబుతారు అగ్ర దర్శకుడు పూరి జగన్నాథ్‌. మానవాళిని భయపెడుతున్న కరోనా గురించి ఆయన తనదైన శైలిలో స్పందిస్తూనే ఉన్నారు. అందరూ ఇళ్లల్లోనే ఉండాలని చెబుతూనే, ప్రపంచం ఇంతకంటే కష్టాలు ఎన్నో చూసిందని ధైర్యాన్ని కూడా నూరిపోశారు పూరి. ఆయనతో ‘ఈనాడు సినిమా’ ప్రత్యేకంగా ముచ్చటించింది. ఆ విషయాలివీ...

బీచ్‌లని మిస్‌ అవుతుంటారేమో అని చిరంజీవి మీ గురించి ట్వీట్‌ చేశారు. నిజంగా మిస్‌ అవుతున్నారా?

చిరంజీవి సర్‌ ట్వీట్‌ నాకొంప ముంచింది (నవ్వుతూ). ఈ లాక్‌డౌన్‌ పీరియడ్‌లో ఆయన ఎందుకు బ్యాంకాక్‌ టాపిక్‌ ఎత్తారో తెలియదు కానీ... ఆయన ట్వీట్‌ చూసి పక్కనే ఉన్న మా ఆవిడకి అన్నీ ఒకేసారి గుర్తుకొచ్చాయి. నా మీద చెయ్యి చేసుకుంది. ఆయన ట్వీట్‌ ఏంటో కానీ ఇక్కడ నా చెంప పగిలిపోయింది.

మీలో మామూలుగానే వేగం ఎక్కువ. కరోనాతో వచ్చిన ఈ విరామం ఇబ్బందిగా అనిపించిందా?

ఇబ్బందేమీ లేదు. ఇదొక మంచి అవకాశంగా భావిస్తున్నా. కొత్త కథ రాయడం మొదలు పెట్టా. టైమ్‌కి తింటున్నా, నిద్రపోతున్నా. టీవీ చూస్తున్నా, వ్యాయామం చేస్తున్నా. ఇలా బతకాల్సి వచ్చినప్పుడు దాన్ని ఆస్వాదిస్తూ బతికేయడమే. జైలులో బతకాల్సి వచ్చినప్పుడు జైలును ఆస్వాదించడమే సరైన పద్ధతి.

ప్రపంచం ఇలా స్తంభిస్తుందనే ఆలోచనలు ఎప్పుడైనా వచ్చేవా?

ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎన్నోసార్లు అనుకున్నా. స్టీఫెన్‌ హ్యాకింగ్‌ చనిపోయే ముందు కూడా ఈ ప్రపంచ వైపరీత్యాల గురించి ఎన్నో హెచ్చరికలు చేశాడు, కానీ మనం పట్టించుకోలేదు. గత పదేళ్లుగా డేవిడ్‌ అటెన్‌బరో భూతాపం, వాతావరణ మార్పుల గురించి ఎంత మొత్తుకున్నా మనం వినలేదు. కనీసం ఇప్పటికైనా ఇంటర్నెట్‌లో వాళ్లు ఏం చెప్పారో చూడండి. మనందరం నీళ్లు వాడుకుంటున్నాం కానీ, నీటి సంరక్షణ గురించి ఆలోచించడం లేదు. అతి త్వరలో మన దేశంలో మనం ఎదుర్కోబోతున్న అతి పెద్ద సమస్య నీటి కొరత. నగరాలన్నీ నీళ్లకోసం ఏడుస్తాయి. అందరి జీతాలు నీళ్లకే ఖర్చయిపోతాయి.

కర్ఫ్యూ ప్రకటించినా జనం ఇళ్ల నుంచి బయటికొస్తున్నారు. చావంటే భయం లేక అంటారా?

నాకెందుకు వస్తుందిలే అనుకునేవాళ్లే ప్రతి ఒక్కరూ. ఈ కరోనా సమస్య నుంచి బయట పడగానే అందరూ పది రెట్లు ఎక్కువ పనిచేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వచ్చే రెండేళ్లు ఆర్థిక మాంద్యాన్ని చూడబోతున్నాం.

వైపరీత్యాలు వచ్చిన ప్రతిసారీ ప్రపంచం అంతరించిపోతుందనే చర్చ వస్తుంటుంది. దీనిపై మీ అభిప్రాయం?

అంత సులువుగా జరగదు. అలా జరగాలంటే ఇలాంటి ఎన్నో వైరస్‌లు రావాలి, లేదంటే ఏ గ్రహమో, గ్రహశకలమో వచ్చి భూమిని ఢీకొట్టాలి. ఇవేవీ కాదంటే అణుబాంబులన్నీ ఒకేసారి పేలాలి.

ఇప్పుడు కరోనాపైనే కథ రాస్తున్నారా?

పదేళ్ల కిందటే రామ్‌గోపాల్‌ వర్మ కరోనాలాంటి వైరస్‌ వస్తే ప్రపంచం ఎలా ఉంటుందనే కథ చెప్పారు. నాకు మాత్రం కరోనాపై సినిమా ఆలోచన లేదు. ఇప్పుడు రాస్తున్నది వేరే కథ.

చాలా రోజుల తర్వాత బాలీవుడ్‌లోకి అడుగు పెడుతున్నారు?

బాలీవుడ్‌ వాతావరణాన్ని బాగా ఆస్వాదిస్తా. ఫైటర్‌గా విజయ్‌ దేవరకొండ ఇరగదీస్తున్నాడు.

పెళ్లిళ్లు చేసుకోవడం మానెయ్యాలి

"ప్రకృతిని జనాలు ఎప్పటికీ అర్థం చేసుకోరు. అందుకే అదే అందరినీ సర్దుకుంటూ తన పని తాను చేసుకుంటూ పోతుంది. ప్రకృతి ముందు మనమెంత? దాని దృష్టిలో మానవజాతి ఈ భూమికి పట్టిన వైరస్‌. అన్ని దేశాలు జనాభాని నియంత్రించాలి. తర్వాత తరం పెళ్లిళ్లు చేసుకోవడం మానెయ్యాలి. ఇలా సంతానోత్పత్తి చేస్తూ వెళితే అన్ని జంతువులు అంతరించిమనుషులే మిగిలిపోతారు. ప్రపంచంలో పెట్రోల్‌, డీజిల్‌ ఆపేసే రోజులు దగ్గరపడ్డాయి. మనందరం ఎలెక్ట్రిక్‌ కార్లవైపు వెళ్తే మంచిది. కొన్ని దేశాలు 2022 తర్వాత పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలు వాడొద్దని ఉత్తర్వులిచ్చాయి"

-పూరి జగన్నాథ్​

ABOUT THE AUTHOR

...view details