ఒక వ్యక్తి నవ్వులో స్వచ్ఛత ఉందంటే.. అతడు జీవితంలో నిజంగానే కష్టాలు ఎదుర్కొన్నాడని అర్థమని పూరీ జగన్నాథ్(Puri Jagannath) అన్నారు. తాజాగా ఆయన 'పూరీ మ్యూజింగ్స్'(Puri Musings) వేదికగా 'సఫరింగ్'(Suffering) గురించి ఎన్నో గొప్ప విషయాలు తెలిపారు. జీవితమన్నాక ప్రతి ఒక్కరూ కష్టాలు ఎదుర్కొంటారని.. కష్టాల్లేని వ్యక్తి ఈ భూమ్మీద ఉండరని అన్నారు. ఎలాంటి బాధ వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొని.. దాని నుంచి ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకోవాలని తెలిపారు. అలాగే గతాన్ని తలుచుకుని ఏడ్చేవాళ్లు ఎంతోమంది ఉన్నారని.. వారిని చూస్తే ఇంకా బుర్ర ఎదగలేదని అర్థమవుతుందన్నారు.
Puri Musings: కష్టాల్ని ఎదుర్కొన్న వాళ్లే నవ్వగలరు - పూరీ మ్యూజింగ్స్ సఫరింగ్
'పూరీ మ్యూజింగ్స్'(Puri Musings) ద్వారా పలు విషయాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్. తాజాగా 'సఫరింగ్' గురించి వివరించారు.
"మనందరికీ బాధ, కష్టం అంటే భయం. జీవితంలో బాధపడకూడదని కోరుకుంటాం. కానీ, మనం ఎంత కోరుకున్నా కుదరదు. ఎందుకంటే జీవితమన్నాక ఎప్పుడో ఒకసారి బాధపడాల్సిందే. పుట్టిన వెంటనే బాధతో ఏడుస్తూనే ఊపిరిపీలుస్తాం. చివర్లో ఊపిరి వదిలేయడానికి కూడా బాధపడతాం. కాబట్టి బాధను అంగీకరించండి. ఆ అనుభవాన్ని పొందండి. కష్టాలు పడండి, కన్నీళ్లు రాలనివ్వండి. రక్తం కారనివ్వండి. జీవితంలో ఎదుర్కొనే కష్టాలు, బాధల వల్లే మెదడు మరింత దృఢంగా మారుతుంది. గతాన్ని తలుచుకుని ఇంకా ఏడుస్తున్నారంటే మీకు ఇంకా బుద్ధి రాలేదని అర్థం. గతంలో ఎదురైన కష్టాలు గుర్తుకు వస్తే.. నవ్వు రావాలి. అంతేకానీ ఏడుపు కాదు. బాధ పడకుండా.. కష్టాలు ఎదుర్కోకుండా ఎవ్వరూ చావరు. కష్టాల వల్ల మనలో ఒక గ్రేస్ వస్తుంది. కళ్లల్లో ఒక మెరుపు ఉంటుంది. ఒక సాధారణ వ్యక్తి పగలపడి నవ్వినా ఎవరూ పట్టించుకోరు. కానీ, యుద్ధంలో పోరాడి వచ్చిన వ్యక్తి ముఖంపై ఉండే చిన్న చిరు నవ్వు కూడా ప్రతి ఒక్కర్నీ ఆకర్షిస్తుంది. ఆ చిరునవ్వు ఎంతకాలమైనా గుర్తుండిపోతుంది. ఎదుటివ్యక్తి నవ్వులో లోతైన ఆనందం ఉంటే.. దాని అర్థం అతను జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడని" అని పూరీ వివరించారు.