తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మంచి మనుషుల సాయాన్ని గుర్తించండి' - పూరీ మ్యూజింగ్స్

మనిషి తన స్వార్థం కోసం మానవత్వాన్ని అడ్డుపెట్టుకుంటున్నాడని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ అంటున్నారు. ఆయన పూరీ మ్యూజింగ్స్‌లో తాజాగా 'మానవత్వం' అనే అంశం గురించి ముచ్చటించారు.

Puri Musings about Humanity
'మంచి మనుషుల సాయాన్ని గుర్తించండి'

By

Published : Oct 4, 2020, 9:00 PM IST

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇటీవలే 'పూరీ మ్యూజింగ్స్​' అనే పాడ్​కాస్ట్​ను ప్రారంభించారు. ఇందులో అనేక అంశాలపై తన అభిప్రాయాలను ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. తాజాగా 'మానవత్వం' అనే అంశంపై ముచ్చటించారు పూరీ. మనిషి తన స్వార్థం కోసం మానవత్వాన్ని అడ్డుపెట్టుకున్నాడని అన్నారు.

"అనాగరిక దశ నుంచి మనిషి బతకడానికి అనేక కష్టాలు పడ్డాడు. అడవిలో జంతువుల మధ్య జీవించడం అంత సులభం కాదు. పులి, సింహాల నుంచి తప్పించుకోవడానికి మనిషి కనిపెట్టిన ఆయుధం బాణం. ఎండ, వాన కోసం కనిపెట్టిన ఆయుధం గుడిసె. క్రిమి కీటకాలు, జబ్బుల కోసం కనిపెట్టిన ఆయుధం వైద్యం. చివరిగా మనిషి నుంచి మనిషిని కాపాడటం కోసం కనిపెట్టిన పేరు మానవత్వం. ఇది ఆయుధమే.. కానీ కనిపించదు."

"దేవుడు కూడా మానవత్వాన్ని కాపాడటం కోసం ఉన్నాడని చెబుతుంటాం. దాన్ని అవతలి వాడు నమ్మి, మనల్ని వదిలేశాడు. లేకపోతే ఎప్పుడో చంపేసేవాడు. దేవుడి దృష్టి మొత్తం మనుషులపైనే ఉంటుందని.. మనిషిని మనిషి చంపకూడదని చెప్పాం. అందుకే మానవత్వం కోసం అందరూ పనిచేస్తున్నారు. అయినా సరే.. కొట్టుకుంటున్నాం, చంపుకొంటున్నాం. కష్టాల్లో ఉన్న మనిషికి నిజంగా సాయం చేసేవారు చాలా మంది ఉన్నారు. వాళ్లల్లో ఉన్నది మనిషి స్వార్థంతో కనిపెట్టిన ఈ మానవత్వం కాదు. ఇంకా ఏదో గొప్ప గుణం ఉంది. దానికి వేరే పేరు పెట్టాలని నాకు అనిపిస్తుంటుంది. మీకు ఏదైనా తడితే నాకు చెప్పండి. అది మానవత్వాని కంటే మంచి పేరై ఉండాలి. ఓ లోయలో పడి, మునిగిపోతున్న వ్యక్తిని ఒకడు కాపాడాడు. 'అన్నా.. దేవుడు నిన్ను సరైన సమయానికి పంపాడు' అని అంటాడు. అంతేకానీ.. కాపాడిన వ్యక్తిని గుర్తించడు. మంచి మనుషుల సాయాన్ని గుర్తించండి. మనకు నిజంగా సాయం చేసేది, కాపాడేది సాటి మనిషే.. ఆ మనిషికి గౌరవం ఇవ్వండి" అని పూరీ ముగించారు.

అదేవిధంగా పూరీ.. 'తల్లి' గురించి కూడా మాట్లాడారు. అమ్మ గొప్పతనాన్ని వివరించారు. "ప్రతి తల్లి ఓ పులి, తన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. పిల్లల ఆకలి తీరేంత వరకూ తను తినదు. అలాంటి తల్లిని బాధపెట్టేది కూడా పిల్లలే.." అని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details