'పూరీ మ్యూజింగ్స్'లో భాగంగా ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ సింప్లిసిటీ, జీవితం పై తన మనసులోని మాటల్ని బయటపెట్టారు. 'వర్తమానాన్ని స్వీకరించటమే ‘సింప్లిసిటీ' అని స్పష్టం చేశారు. తన ఆలోచనలు, అనుభవాల మేరకు దాన్ని వివరించే ప్రయత్నం చేశారు.
అన్నిటికంటే కష్టం :
'అన్నింటి కంటే కష్టమైంది సింపుల్‌గా బతకటం. అలా ఉండటం అనుకున్నంత సులభం కాదు. ఫలానాదే కావాలని కూర్చుంటే కుదరదు. దేనికైనా సర్దుకుపోవటం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ జీవితం పర్‌ఫెక్ట్‌కాదు. నువ్వు పర్‌ఫెక్ట్ కాదు. అనుకున్నది అనుకున్నట్లు జరగకపోవటమే జీవితం’.
సింప్లిసిటీ అంటే ఇదే :
'నువ్వు ఏదైనా కావాలని దేవుడ్ని కోరుకుంటే.. ఆయన నీకున్న ఒక ఆవును పోగొట్టి.. అది మళ్లీ దొరికేలా చేస్తాడు (ఉదాహరణగా..). ఈ మధ్యలో జరిగేదే జీవితం, ఏది జరగకూడదో అది జరగటమే జీవితం. సింప్లిసిటీ అంటే వర్తమానాన్ని స్వీకరించటం. అంతేకానీ పేదరికంలో బతకటం కాదు. రూ.వేల కోట్లు ఉన్న వాళ్లు కూడా సింపుల్‌గా జీవిస్తున్నారు. ప్రపంచంలోని టాప్ సీఈవోలు 2500 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. మనం వీళ్ల కంటే ఎక్కువ పనిచేయడం లేదు కదా?. మనకు ఏది అవసరమో, ఏది అనవసరమో తెలియాలి. అవసరం లేనివి పక్కనపెడితే అదే సింప్లిసిటీ.. ఇలా ఉండటం చాలా కష్టం. అయినా చెబుతున్నా.. సింపుల్‌గా ఉండండి..' అని ముగించారు.