'పూరి మ్యూజింగ్స్'లో భాగంగా ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తన జీవితంలోని అనుభవాలను పంచుకునే ప్రయత్నం చేశారు. సమాజంలోని ట్రాష్ బ్యాగ్స్ గురించి చెప్పారు. జీవితంలో అనుకున్న స్థానానికి చేరుకోవాలంటే అనవసర లగేజ్‌తో బయలుదేరకూడదని సూచించారు. అందుకు ఉదాహరణగా ఓ కథను వివరించారు.
ఇదే కథ :
"ఎడ్మండ్ హిల్లరీ ఎలాగైనా ఎవరెస్ట్ ఎక్కాలనుకున్నాడు. అందరితో కలిసి ప్రయాణానికి సిద్ధమయ్యాడు. 352 పోర్టర్స్, 20మంది షేర్ పాస్ అన్ని కలిపి 4,500కేజీల లగేజ్ అయ్యింది. వీళ్లతో పాటు ఇంకొంతమంది వైద్యులు కూడా ఉన్నారు. మొత్తం సుమారు 400మంది అయ్యారు. అంతా కలిసి ఎవరెస్ట్ ప్రయాణం మొదలుపెట్టారు. కొంత దూరం వెళ్లాక, కొన్ని వస్తువులు అవసరం లేదనిపించి వదిలేశాడు. బేస్ క్యాంప్‌నకు రీచ్ అయ్యేసరికి ఇంకొన్ని అక్కర్లేదనిపించింది. కొన్ని టెంట్‌లను అక్కడే వదిలేశాడు. కొంతమందిని వెనక్కి పంపించేశాడు. అలా నడక సాగిస్తుండగా ఏది అవసరమో అర్థమైంది. చివరిగా అతనొక్కడే ఎవరెస్ట్ ఎక్కాడు. అసలు ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కాలనుకున్నది ఎడ్మండ్ హిల్లరీ ఒక్కడే. 400 మంది కాదు."
"అలాగే జీవితంలో నువ్వు అనుకున్న స్థానానికి చేరుకోవాలంటే, అనవసరమైన లగేజ్‌తో బయలుదేరకూడదు. కొండకు తాడుకట్టి, దాన్ని పట్టుకుని ఎక్కుతున్నప్పుడు నీకు నువ్వే బరువు, దానికి తోడు కొంతమంది నిన్ను పట్టుకుని వేలాడుతుంటే ఇంకేం ఎక్కుతావు. నీతోపాటు వీళ్లందరినీ పెట్టుకుంటే నిన్ను కొండ ఎక్కకుండా ఆపుతుంటారు. మన చుట్టూ ఉన్న చెత్తను గుర్తించాలి. సగం చెత్త మనుషుల రూపంలో ఉంటుంది. ఈ విషయం నాకు తెలిసే సరికి సగం జీవితం అయిపోయింది. మీరైనా జాగ్రత్తగా ఉండండి. గుర్తు పెట్టుకోండి ట్రాష్ బ్యాగ్స్ ఎప్పుడూ నవ్వుతూ, మనతో మాట్లాడుతూ, మనతోనే ఉంటాయి. వాటిమీద ట్రాష్ బ్యాగ్స్ అని రాసి ఉండదు. మనమే గుర్తుంచుకోవాలి. ఓషో ఒక మాట చెప్పారు. "on the highest peak one has to be weightless" అని ట్రాష్ బ్యాగ్స్ గురించి పూరి వివరించారు.