టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ 'పూరీ మ్యూజింగ్స్' పేరిట వివిధ అంశాలపై తన అభిప్రాయం పంచుకుంటున్నాకు. తాజాగా బియ్యం రకాలు, వాటిల్లో గొప్పవైన 'రాజముడి' రైస్ గురించి తెలియజేశారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
"మనందరికీ బియ్యం ముఖ్యమైన ఆహారం. వివిధ రకాల బియ్యం పేర్లు వినే ఉంటారు. బాసుమతి, అన్నపూర్ణ, చంపా, హన్సరాజ్, మొలకొలుకులు, పూస, సోనా మసూరి, జాస్మిన్, సురేఖ.. ఇలా కొన్ని మాత్రమే మనకు తెలుసు. భారతదేశంలో ఒకప్పుడు లక్ష రకాల బియ్యం ఉండేవి. ఒక రకం పండించే రైతు చనిపోతే అదే రకం మళ్లీ దొరికేది కాదు. అలా ఎన్నో రకాలు మాయమైపోయాయి. చివరికి 40,000 రకాలు మిగిలాయి. గత 50 ఏళ్లలో అవి కూడా కనుమరుగైపోయాయి. ఇప్పుడు 6,000 మిగిలాయి. వాటిల్లో ఒకదాని గురించి మీకు చెప్పాలి."
"దాని పేరు రాజముడి రైస్. ఇది కర్ణాటకలో పుట్టింది. అక్కడ పూర్వం.. రైతులు పన్నులు కట్టేందుకు డబ్బులు లేకపోతే ఈ రాజముడి రైస్‌తో కట్టేవారు. అంటే అప్పట్లో దానిని కరెన్సీగా భావించేవారు. అంత విలువైన రైస్ అది. విజయ్ రామ్, రాంబాబు అనే ఇద్దరు అన్నదమ్ములు ఈ రకం గురించి నాకు చెప్పారు. వాళ్లిద్దరూ వ్యవసాయం గురించి ఎన్నో పరిశోధనలు చేశారు."
"ఈ బియ్యం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. డయాబెటిక్ ఉన్నవారు తప్పనిసరిగా తినాలి. ఆడవాళ్లు తప్పకుండా తినాల్సిన బియ్యం ఇవి. రుతుక్రమంలో వారికి ఎదురయ్యే సమస్యలు చాలా వరకూ తగ్గుతాయి. వీటిని నాలుగైదు గంటలు నీళ్లలో నానబెట్టి ఆ తర్వాత ఎసరు పెట్టి వండుకోవాలి. గంజి వార్చి దాన్ని దాచుకోండి సాయంత్రం ఆ గంజిని తాగండి. మనం తినే తిండి వల్ల ఎన్నో జబ్బులొస్తున్నాయి. కొన్నాళ్లు మీరు తినే తెల్ల బియ్యం పక్కన పెట్టి రెడ్ రైస్ తినండి. అదే రాజముడి. రాజుగారికి ముడిగా చెల్లించిన బియ్యం" అని పూరి జగన్నాథ్ తెలిపారు.