తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'జగన్​కు నేను, నా కుటుంబం రుణపడి ఉంటాం'

వైకాపా అధినేత జగన్మోహన్‌ రెడ్డికి తానెప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్‌ తిరుగులేని మెజార్టీని సాధించి గెలుపొందారు. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు పూరి జగన్నాథ్​.

'జగన్​కు నేను, నా కుటుంబం రుణపడి ఉంటాం'

By

Published : May 26, 2019, 2:00 PM IST

వైకాపా అధినేత జగన్మోహన్‌ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు డాషింగ్​ డైరెక్టర్​ పూరి జగన్నాథ్​. తానెప్పుడూ ఆయనకు రుణపడి ఉంటానని సోషల్​ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్‌ తిరుగులేని మెజార్టీని సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. జగన్‌ వల్లే తన సోదరుడు ఉమాశంకర్‌ గణేశ్‌.. విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి వైకాపా తరఫున ఎమ్మెల్యేగా గెలిచారని అన్నారు.

" ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు నేను వైజాగ్‌లో ఉన్నాను. మా కుటుంబ సభ్యులందరితో కలిసి టీవీ చూస్తున్నా. ఎందుకంటే నా తమ్ముడు ఉమాశంకర్‌ గణేశ్‌ ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. అతను గెలవడం చాలా కష్టం అనుకున్నాం. కానీ వార్‌ వన్‌సైడ్‌ అయిపోయేసరికి మతిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలంతా రహస్యంగా మీటింగ్‌ పెట్టుకుని జగన్‌కే ఓటేద్దామనుకున్నారేమో..! ఇన్ని కోట్ల మంది ఒకేసారి ఒక మనిషిని నమ్మడం, అతను వాళ్ల నాయకుడు కావాలని కోరుకోవడం చిన్న విషయం కాదు. జగన్‌కు హ్యాట్సాఫ్‌‌. ఎందుకంటే తండ్రి వైఎస్​ రాజశేఖర్‌రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన ఒంటరివాడయ్యారు. ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలను తట్టుకుంటూ శక్తిని కూడగట్టుకుని ఈ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించారు. విజయం సాధించిన తర్వాత జగన్‌ మీడియాతో మాట్లాడిన వీడియో చూశాను. ఆయన ముఖంలో విజయ గర్వం లేదు. పొగరు లేదు. మౌనంగా ఉన్నారు. సేద తీరుతున్నారు. ఏదేమైనా రాజన్న కుమారుడు అనిపించుకున్నారు. జగన్‌ యోధుడు. దైవ నిర్ణయం, ప్రజా నిర్ణయం వల్ల ఈ విజయం దక్కిందని జగన్‌ అన్నారు. నా ఉద్దేశంలో దైవ నిర్ణయం కంటే ప్రజా నిర్ణయమే గొప్పది".

-- పూరి జగన్నాథ్, టాలీవుడ్​ దర్శకుడు

పూరి జగన్నాథ్​ ట్వీట్​

"నా సోదరుడికి జగన్‌ అంటే ప్రాణం. ఆయన ఫొటో చూసినా, వీడియో చూసినా ఎగ్జైట్‌ అయిపోతాడు. అతను ఎందుకలా ఫీలవుతాడో నాకు ఇవాళ అర్థమైంది. గత ఎన్నికల్లో నా తమ్ముడు ఓడిపోయినా, మళ్లీ భుజం తట్టి, చెయ్యి పట్టుకుని యుద్ధంలోకి లాక్కెళ్లి ఇంతటి విజయాన్ని వాడికి అందించిన జగన్‌కు నేను, నా కుటుంబం రుణపడి ఉంటాం. నేను రాజకీయాల్లో లేను. కానీ నాకు యోధులంటే ఇష్టం. నాకు జగన్‌ సింహంలా కనిపిస్తున్నారు' అని పేర్కొన్నారు పూరి జగన్నాథ్.

ABOUT THE AUTHOR

...view details