తన చిరకాల కల నెరవేరకుండానే కన్నడ స్టార్ హీరో, పవర్‌స్టార్ పునీత్‌కుమార్ కన్నుమూశారని ప్రముఖ దర్శకుడు మెహర్ రమేశ్ అన్నారు. పునీత్ మరణం పట్ల విచారం వ్యక్తం చేసిన ఆయన.. నటుడితో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. పునీత్ వల్లే తన కెరీర్ మొదలైందని అన్నారు.
"పునీత్ నటించిన 'వీర కన్నడిగా' చిత్రంతోనే నేను దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యాను. అనంతరం నా రెండో ప్రాజెక్ట్ 'అజయ్' కూడా ఆయనతోనే చేశాను. నన్ను తన ఇంటిసభ్యుడిలా చూసుకునేవాడు. షూటింగ్ జరిగినన్ని రోజులూ వాళ్ల ఇంటిలోనే భోజనం చేసేవాడిని. ఇటీవల 'భోళాశంకర్' ప్రకటించిన సమయంలో పునీత్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. అభినందనలు చెప్పి.. 'చిరంజీవి సర్‌తో స్క్రీన్ పంచుకోవాలనేది నా కోరిక. మీరు ఛాన్స్ ఇస్తే ఈ సినిమాలో ఏదైనా అతిథి పాత్ర ఉంటే చేస్తాను. ఆఖరి పాటలోనైనా ఆయనతో కలిసి ఓ చిన్న స్టెప్పు వేస్తాను' అని అడిగారు. ఆ విషయాన్ని నేను చిరంజీవితో కూడా చెప్పాను. పునీత్ కోసం సినిమాలో ఓ స్పెషల్ రోల్ రాయాలనుకున్నాను. అలాగే, నవంబర్‌లో జరగనున్న మా సినిమా ప్రారంభోత్సవానికి పునీత్‌ను ముఖ్యఅతిథిగా పిలవాలనుకున్నాను. ఇంతలో ఈ ఘోరం జరిగిపోయింది" అని మెహర్ రమేశ్ వివరించారు.