కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ తన కళ్లను దానం చేశారు. ఆయన తండ్రి అడుగుజాడల్లోనే నడిచారు. దిగ్గజ నటుడు డా. రాజ్‌కుమార్ చనిపోయినప్పుడు కూడా ఆయన కళ్లను వేరొకరికి దానం చేశారు.
పునీత్ కోరిక మేరకు.. ఆయన నేత్రాలను బెంగళూరులోని నారాయణ కంటి ఆస్పత్రికి అందజేశారు. ఈ నిర్ణయం పట్ల అభిమానులు పునీత్‌ను కొనియాడుతున్నారు. భావోద్వేగంతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.
''పునీత్ రాజ్‌కుమార్.. ఎల్లప్పుడూ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కార్యక్రమాల కోసం మద్దతు ఇచ్చేవారు. రాష్ట్ర ప్రజల బాగు కోసం తపించారు. ఇప్పుడు.. మరణం తర్వాత కూడా కళ్లను దానం చేసి ఎందరికో ఆదర్శంగా నిలిచారు.''
- కె.సుధాకర్, కర్ణాటక ఆరోగ్య మంత్రి
జిమ్ చేస్తూ..
శుక్రవారం ఉదయం ఇంట్లో జిమ్ చేస్తుండగా గుండెపోటుతో కుప్పకూలి పడిపోయిన పునీత్‌ను కుటుంబసభ్యులు హుటాహుటిన విక్రమ్ ఆస్పత్రికి తరలించారు. వెంటనే స్పందించిన వైద్యులు ఆయన్ను బతికించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయినా ప్రాణాలు దక్కలేదు. పునీత్ మరణంతో కన్నడ సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పునీత్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
పవర్‌స్టార్ మరణంతో.. రాష్ట్రంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లు మూసివేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది.
పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వమే అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పష్టం చేశారు.
ఇవీ చూడండి:'పునీత్' మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం
Puneeth Rajkumar News: ఆరు నెలల వయసులోనే సినీ అరంగేట్రం!