గుండెపోటుతో అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిన కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్(Puneeth Rajakumar news).. నలుగురి జీవితాల్లో వెలుగులు నింపారు. బెంగళూరు నారాయణ నేత్రాలయకు ఆయన కళ్లు దానం(eye donation) చేయగా.. వాటి ద్వారా వైద్యులు ఓ మహిళతో పాటు మరో ముగ్గురికి చూపు వచ్చేలా చేశారు.
నలుగురికి గత శనివారం శస్త్ర చికిత్స విజయవంతంగా జరిగినట్లు చెప్పారు నారాయణ నేత్రాలయలోని ఆప్తమాలజిస్ట్ డాక్టర్ భుజంగశెట్టి. వారు ఇప్పుడు చూడగలుగుతున్నారని, అందరినీ గుర్తిస్తున్నారని తెలిపారు. డాక్టర్ యతీస్, డా. ప్రార్థన ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారని కొనియాడారు.
" డాక్టర్ రాజ్‌కుమార్ కుటుంబం వారు చెప్పిందే చేశారు. తండ్రి హామీని పిల్లలను నిలబెట్టారు. తన తండ్రి మాట ప్రకారం తన కళ్లను దానం చేశారు అప్పు. పునీత్ మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. కానీ, ఆయన నలుగురి జీవితాల్లో వెలుగులు నింపారు. సాధారణంగా ఒక కంటిలోని కార్నియా రెండు పొరలను విడదీసి.. ఇద్దరికి చూపు వచ్చేలా చేస్తారు. ఇక్కడ రోగులు పైన ఉండే కార్నియా వ్యాధితో బాధపడుతున్నారు. మరో ఇద్దరు ఎండోథేలియాల్తో(కింది పొర పాడైపోవటం) చూపు కోల్పోగా.. వారికి పునీత్ రెండు కళ్లతో చూపు తెప్పించగలిగాం. ఈ రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ ఇలాంటి ఆపరేషన్ జరగలేదు. "