ఓటీటీ మాధ్యమంలో తన చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్న హీరో, నిర్మాతను విమర్శించడం.. వ్యక్తిగతంగా బెదిరించడం సరికాదని యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఓ ప్రకటనలో తప్పుబట్టింది. చిత్ర పరిశ్రమకు చెందిన సభ్యుల్ని కించపరిచేలా.. తెలంగాణ రాష్ట్ర సినీ థియేటర్స్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్ సమక్షంలో పలువురు చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపింది.
హీరోను వ్యక్తిగతంగా బెదిరించడం తగదు - టక్ జగదీష్
ఓటీటీ వేదికగా సినిమాలను విడుదల చేయాలని నిర్ణయించిన హీరో, నిర్మాతను బెదిరించడం తగదని యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ గిల్డ్ ఓ ప్రకటన చేసింది. తమ సినిమాపై సర్వహక్కులూ నిర్మాతకు ఉంటాయని స్పష్టం చేసింది.
"తన చిత్రంపై సర్వహక్కులూ నిర్మాతకే చెందుతాయి. తన చిత్రాన్ని ఎప్పుడు ఎక్కడ విడుదల చేయాలనే నిర్ణయం తీసుకునే హక్కు నిర్మాతదే. అలాగే తెలుగు చిత్రపరిశ్రమలో మార్కెట్ ఉన్న హీరోలు చాలా మంది ఉన్నారు. అందువల్లే పరిశ్రమ అభివృద్ధి చెందుతోంది. ప్రత్యేకంగా ఒక హీరోను లక్ష్యంగా చేసుకోవడం పరిశ్రమలోని ఆరోగ్యకర స్నేహపూర్వక సంబంధాల్ని దెబ్బతీస్తుంది. ప్రదర్శనకారులు విపరీతమైన డిమాండ్ ఉన్న సినిమాలపైనే ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో చాలా చిత్రాలు వివిధ మార్గాల ద్వారా తమ పెట్టుబడిని రాబట్టుకుంటున్నాయి. కరోనాతో ఎదురైన సమస్యలకు అందరం కలిసికట్టుగా పరిష్కార మార్గాల్ని అన్వేషించాల్సిన సమయం వచ్చిందని" నిర్మాతల గిల్డ్ పేర్కొంది.