Sarvanand Rashmika Adavallu meeku joharlu: "కొవిడ్ ప్రభావం తర్వాత ఇప్పుడిప్పుడే అందరూ బయటికొస్తున్నారు. కుటుంబ ప్రేక్షకులందరినీ మా సినిమా థియేటర్‌కు తీసుకొస్తుందనే నమ్మకం ఉంది" అన్నారు సుధాకర్ చెరుకూరి. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై వరుసగా సినిమాలు తీస్తున్న నిర్మాత ఆయన. శర్వానంద్, రష్మిక మందన్న జంటగా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రాన్ని నిర్మించారు. తిరుమల కిషోర్ దర్శకుడు. ఈ చిత్రం ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత సుధాకర్ చెరుకూరి చెప్పిన విశేషాలేంటో చూద్దాం.
"మేం తొలి ప్రయత్నంగా చేసిన ‘పడి పడి లేచే మనసు’ తర్వాత ఓ మంచి కుటుంబ కథను నిర్మించాలనుకున్నాం. దర్శకుడు కిషోర్ దగ్గర అలాంటి కథ ఉందని తెలిసి విన్నాం. మేం ఏదైతే ఊహించామో అలాంటి కథే అది. ఉమ్మడి కుటుంబంలోని అనుబంధాలు, ఆప్యాయతల నేపథ్యంలో సాగే కథ. నాకు బాగా నచ్చింది. ఈ కథకి తగ్గ నటులే కావాలనిపించింది. రష్మిక, ఖుష్బూ, రాధిక తదితరుల్ని ఎంపిక చేసుకున్నాక, తీరా వాళ్ల డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆరు నెలలు ఆలస్యమైనా ఈ సినిమాని చేశాం. మహిళలు ఎక్కువగా ఉన్న ఓ కుటుంబంలో వారసుడిగా ఓ మగాడు ఉంటే అతనిపై ఎలా ప్రేమని కురిపిస్తారు? ఆ ప్రేమతో తెలియకుండానే ఎలా ఇబ్బంది పెడతారనే అంశాల నేపథ్యంలో సాగే కథ ఇది. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే కథ. మా సినిమా నేపథ్యం, ఎంచుకున్న అంశం నచ్చే దర్శకుడు సుకుమార్ వాయిస్ ఓవర్ ఇచ్చారు".
"కుటుంబం నేపథ్యంలో సాగే డ్రామాతోపాటు, కావల్సినంత హాస్యం ఉంటుంది. దర్శకుడు కిషోర్ ప్రత్యేకత అదే. ప్రతి కుటుంబంలోనూ పెద్దమ్మలు, చిన్నమ్మలు, బామ్మలు... ఇలా చాలా సందడే ఉంటుంది. నేనూ ఆ బంధాల మధ్య నుంచి వచ్చినవాణ్నే. అందుకే బాగా కనెక్ట్ అయ్యాను. ఈ సినిమా చూశాక ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒక చోట తమని తాము చూసుకుంటారు. నా నమ్మకాల్ని నిలబెట్టే చిత్రమిది. కొవిడ్ సమయంలోనే నటీనటుల సహకారంతో చిత్రాన్ని అనుకున్న సమయంలోనే పూర్తి చేశాం. దేవిశ్రీప్రసాద్ సమకూర్చిన సంగీతం ఇప్పటికే విజయవంతమైంది. శర్వానంద్, రష్మికతోపాటు... సాంకేతిక బృందమంతా చక్కటి సహకారం అందించింది".