ఒకటా... రెండా?... ఎన్ని సినిమాలు! ఎన్ని ప్రశంసలు! ఎన్ని భాషలు?.. ఆయనకు ఉన్నది పట్టుదల. అది నెరవేరడానికి దీక్ష. కార్యదక్షత ఆయన సంకల్ప బలం. ఇలాంటివెన్నో రామానాయుడి దగ్గర గ్రహించాలి. ముఖ్యంగా సినిమాలు నిర్మించాలని పరిశ్రమలోకి వచ్చే వారందరికీ ఈయన జీవితం, కచ్చితంగా చదవాల్సిన పుస్తకంలాంటింది. ఓ సినిమా హిట్టయితే పొంగిపోలేదు. ఫట్టయితే గట్టుమీద చతికిలబడి కుంగిపోలేదు. 'రాముడు భీముడు' (1964) నుంచి నిరంతరం ఒకటే శ్రమ, నిజాయితీ, ఆలోచన, చిరునవ్వు. వ్యాపారం చేసేందుకు ఇండస్ట్రీ అనుకూలంగా ఉన్న రోజులవి. చిత్తశుద్ధితో.. ప్రణాళికతో.. అవగాహనతో.. సినిమా తీస్తే నష్టం రాని రోజులవి. 'అనురాగం' సినిమా నిర్మాణంలో భాగస్వామిగా చేరి, అసలు సినిమా ఎలా తీస్తారు? అనే విషయాలను పూర్తిగా గ్రహించిన తర్వాతే సొంతంగా సినిమా తీయడం ప్రారంభించారు రామానాయుడు. నేడు (జూన్ 6) ఆయన జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.
తొలి చిత్రమే సాహసం
తానుగా ఓ భారీ సినిమా తీయాలని రామానాయుడు.. తన కుమారుడు పేరుతో సురేశ్ ప్రొడక్షన్స్ స్థాపించారు. చాలా మంది తీయాలనుకుని ధైర్యం చాలక వదిలేసిన ఓ స్క్రిప్ట్ తొమ్మిదేళ్లుగా రచయిత నరసరాజు దగ్గరుంది. ఆ విషయం తెలుసుకుని, "నేను ధైర్యం చేస్తాను. తప్పకుండా ఈ కథ కొత్తగా ఉంటుంది" అని భావించి, 'రాముడు - భీముడు' ఆరంభించారు. ఎన్టీఆర్ను సంప్రదిస్తే డేట్స్ ఇచ్చారు. తొలిసారిగా రామారావు ద్విపాత్రాభినయం చేసిందీ సినిమాలోనే. అయితే ఇదీ ఓ ప్లస్ పాయింట్ అవుతుంది అని అనుకున్నారు నాయుడు. అలా మొదటి ప్రయత్నమే సాహసవంతమైంది. 'రాముడు-భీముడు'తో సురేశ్ ప్రొడక్షన్ సంస్థ విజయపతాకం ఎగురవేసింది. నాయుడు సంకల్ప బలానికి చిహ్నం ఆ చిత్రం.
నిర్మాత అంటే అలానే ఉండాలి
రామానాయుడు.. విజయ నాగిరెడ్డితో కలిసి, విజయ సురేష్ పేరుతో కొన్ని సినిమాలు తీశారు. మొదటి సినిమా 'పాపకోసం' (1968) పనిచేశానని నటుడు, రచయిత రావి కొండలరావు చెప్పారు. సిపాయి చిన్నయ్య, ద్రోహి, జీవన తరంగాలు, ముందడుగు, ప్రేమనగర్, ఒక చల్లని రాత్రి, ప్రేమఖైదీ, సావాసగాళ్లు - ఇలా ఎన్నో సినిమాల్లో నటించానని తెలిపారు. అయితే, ఏనాడూ 'నా పారితోషికం ఎంత?' అని అడగలేదు. ఆయనే పంపిస్తారు. ఏ హీరో, హీరోయిన్లో తప్పితే, తక్కిన వాళ్లెవరూ పారితోషికం గురించి మాట్లాడేవారు కాదు. ఆయనే న్యాయంగా ఇస్తారు. నటీనటులకు, టెక్నీషియన్లకు ఎప్పుడూ ఆయన బాకీ పడలేదు. తన సినిమా పరాజయం పొందినా, విజయం సాధించినా అందరికీ సకాలానికి పారితోషికాలు పంపించేసేవారు. అది దక్షతగల నిర్మాతల విధానం! ఎంతో అవసరం వస్తే తప్ప ఎవరూ ఆయన్ని డబ్బు కావాలని అడిగేవారు కాదు.