"ఇప్పుడున్న పరిస్థితుల్లో మునుపటిలా వందల కోట్ల వసూళ్లు చూడటం కష్టమే. దానికి ఓవర్సీస్ మార్కెట్లు పూర్తిస్థాయిలో తెరచుకోవాల్సి ఉంటుంది. ఇది పాన్ ఇండియా చిత్రాలు, పెద్ద స్టార్ల సినిమాలపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఈ విషయంలో చిత్రసీమ పూర్తిగా కోలుకోవడానికి 2022 వేసవి వరకు వేచి చూడక తప్పదు" అని అన్నారు నిర్మాత బన్నీ వాసు. ‘100% లవ్’, ‘భలే భలే మగాడివోయ్’, ‘గీత గోవిందం’ లాంటి విజయవంతమైన చిత్రాలతో మంచి అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారాయన. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్‌లు నిర్మిస్తున్నారు. శుక్రవారం బన్నీ వాసు పుట్టినరోజు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఈ పుట్టినరోజు సందర్భంగా కొత్త లక్ష్యాలు నిర్దేశించుకున్నారా?
గతేడాది నుంచి చిత్రసీమ చాలా నష్టపోయింది. మా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. వీటిని తిరిగి గాడిన పెట్టుకోవాలి. ప్రస్తుతం రెండు కొత్త ప్రాజెక్ట్‌లు మొదలుపెడుతున్నాం. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో వాస్తవంగా జరిగిన కథతో ఓ చిత్రం రూపొందించనున్నాం. ఒక సీనియర్ దర్శకుడు ఆ సినిమాని తెరకెక్కిస్తారు. అలాగే రాహుల్ రవీంద్ర దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాం.
కరోనా దెబ్బ చిన్న సినిమాలు, పెద్ద చిత్రాలపై ఎలాంటి ప్రభావం చూపించనుంది?
తొలి దశ కరోనా తర్వాత తెలుగు చిత్రసీమ చక్కగా పుంజుకుంది. ఇక్కడ పడినన్ని హిట్లు, ఇక్కడ వచ్చినంత రెవెన్యూ మరే పరిశ్రమలో రాలేదు. ఈ జోరు అలాగే కొనసాగుంటే బాగుండేది. కానీ, సెకండ్ వేవ్ వల్ల పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. ఏప్రిల్ నుంచి రావాల్సిన పెద్ద చిత్రాలన్నీ ఆగిపోయాయి. ఈ ప్రభావం మే, జూన్, జులైలలో విడుదల కావాల్సిన భారీ సినిమాలపైనా పడుతోంది. ఇప్పటికే చిన్న, మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలు చాలా వరకు చిత్రీకరణలు పూర్తి చేసుకొని, విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్లు తెరచుకున్నా.. పెద్ద స్టార్ల సినిమాల మధ్య చిన్న చిత్రాలకు దారి దొరకడం కష్టమే. వచ్చే వేసవి వరకు ఇలాంటి పరిస్థితే కన్పిస్తోంది. కాబట్టి చిన్న చిత్ర నిర్మాతలు ప్రత్యామ్నాయాలు చూసుకోవడం మేలు’’.
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’, ‘గని’, ‘18 పేజీస్’ చిత్రాలు ఎంత వరకు వచ్చాయి?