దిగ్గజ నటి సావిత్రి జీవితాన్ని 'మహానటి' రూపంలో దృశ్యకావ్యంగా మలిచి తెలుగు తెరపై బయోపిక్స్ ట్రెండ్‌కు కొత్త ఊపిరిలూదారు దర్శకుడు నాగ్ అశ్విన్. దీని తర్వాత టాలీవుడ్లో అనేక జీవితకథలు సందడి చేసినా ఏదీ 'మహానటి' స్థాయికి సరితూగ లేకపోయింది. అయితే ఈ యువదర్శకుడి నుంచి మరో గొప్ప నటి బయోపిక్ రాబోతుందని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై నిర్మాత అశ్వనీదత్ మాట్లాడుతూ స్పష్టతనిచ్చారు. తన అల్లుడు నాగ్ అశ్విన్ నుంచి మరో బయోపిక్ వచ్చే అవకాశం లేదని అన్నారు.
"చాలా మంది శ్రీదేవి బయోపిక్ గురించి అడుగుతున్నారు. నా భార్య అయితే నాగీని ఎం.ఎస్.సుబ్బలక్ష్మి జీవితగాథ తీయొచ్చు కదా అని అడిగింది. కానీ, తనకిష్టం లేదని అతడు చెప్పాడు. 'సావిత్రి నా అభిమాన నటి. ఆమె సినిమాలు చూస్తూ పెరిగా. ఆమె అంటే అభిమానం. ఆ అభిమానంతోనే బయోపిక్ తీశా. అదే నా ఆఖరి జీవితగాథ. లేని ఎమోషన్‌ను కల్పించుకోని మరొకరి బయోపిక్ తీయడం చాలా కష్టం' అని నాగీ మాకు చెప్పాడు. కాబట్టి తన నుంచి మరో బయోపిక్ ఆశించొద్దు"