సినిమాలతోనే కాదు.. సామాజిక విషయాల్లో తన వంతు గళం వినిపిస్తూ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నటి ప్రియాంకా చోప్రా. మహిళావాదిగా మహిళల హక్కుల కోసం జరిగే పోరాటంలో చురుకుగా పాల్గొంటుంది. ఆమె ఉద్యమ భావాలు, సేవలను చూసి యూనిసెఫ్ సైతం 'యూనిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్'గా నియమించుకుంది. అనేక అంతర్జాతీయ వేదికలపై ప్రసంగాలు చేసిన ప్రియాంకా.. ఇప్పుడు ప్రభావవంతమైన మహిళల లీడర్‌షిప్ సమావేశంలో పాల్గొనబోతోంది.
అంతర్జాతీయ సమావేశానికి ప్రత్యేక అతిథిగా ప్రియాంకా చోప్రా - ప్రియాంక చోప్రా తాజా వార్తలు
ఈనెల 13 నుంచి 15 తేదీల మధ్య వర్చువల్ విధానంలో జరిగే 'గర్ల్ అప్ లీడర్‌షిప్ సమ్మిట్'లో ప్రత్యేక అతిథిగా పాల్గొననుంది నటి ప్రియాంకా చోప్రా. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్లో వెల్లడించింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిచెల్ ఒబామా, ప్రిన్స్ హ్యారీ సతీమణీ మెగన్ మార్కెల్, నోబెల్ బహుమతి గ్రహీత నదియా మురాద్, ఫేస్‌బుక్ సీవోవో షెరిల్ సాండ్‌బర్గ్, నటి జమీలా జమిల్ వంటి అంతర్జాతీయంగా ప్రభావవంతమైన మహిళలు ఈ నెల 13నుంచి 15 వరకు వర్చువల్ 'గర్ల్‌అప్ లీడర్‌షిప్ సమ్మిట్'లో పాల్గొననున్నారు. వీరంతా ఈ సమ్మిట్‌లో లింగ సమానత్వంపై చర్చిస్తారట. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ప్రియాంకా చోప్రాను ఆహ్వానించారు. ఈ విషయాన్ని ప్రియాంకా తన ట్విట్ట్ర్లో ప్రకటిస్తూ "నేపథ్యం ఏదైనా తమను తాము మార్చుకోవడం సహా సమాజాన్ని, తమచుట్టూ ఉండే ప్రపంచాన్ని మార్చేసే శక్తి మహిళలకు ఉంది. నాతో పాటు మీరూ ఈ సమావేశంలో పాల్గొనండి" అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కు పలువురు ప్రియాంకా అభిమానులు స్పందించారు. 'మాకు చాలా గర్వంగా ఉంది. ఇప్పటికే సమావేశంలో పాల్గొనేందుకు పేరును రిజిస్టర్ చేసుకున్నా'.. "ఈ కాలం అమ్మాయిలకు మీరు స్ఫూర్తిదాయకం. మీ గళాన్ని మంచి కోసం ఉపయోగిస్తారు. మీలాంటి వ్యక్తుల అవసరం ఎంతో ఉంది" అంటూ కామెంట్లు చేస్తున్నారు.