బాలీవుడ్ నటి ఆలియా భట్‌పై ఈ మధ్యన ట్రోలింగ్ మరీ ఎక్కువైంది. సుశాంత్ ఆత్మహత్య విషయంలో ఆమెను లక్ష్యంగా చేసుకుని నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు. ఇటీవల వచ్చిన ఆలియా 'సడక్ 2' ట్రైలర్‌కు అయితే ఏకంగా 10 మిలియన్లకు పైగా డిస్‌లైక్స్ కొట్టి తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. 'ఆర్ఆర్ఆర్' నుంచి ఆలియాను తప్పించారని, ఆమె స్థానంలో ప్రియాంక చోప్రాను తీసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి.
'ఆర్ఆర్ఆర్' నుంచి ఆలియాను తీసేశారా? - రాజమౌళి ఆర్ఆర్ఆర్
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం 'ఆర్ఆర్ఆర్' నుంచి హీరోయిన్ ఆలియా భట్ నుంచి తప్పించారని వార్తలు వస్తున్నాయి. వీటిపై ఆమె బృందం, సన్నిహితులు స్పందించారు.
వీటిపై స్పందించిన ఆలియా బృందం.. అవన్నీ కేవలం పుకార్లేనని కొట్టిపారేసింది. 'ఆర్ఆర్ఆర్'లో నటించేందుకు ఆమె ఆసక్తితో ఉన్నారని చెప్పింది. తన పాత్ర కోసం సిద్ధమవుతున్నారని, తెలుగు నేర్చుకోవడం సహా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపింది. కరోనాతో నిలిచిపోయిన షూటింగ్‌ను త్వరలో ప్రారంభిస్తారని, అందులో ఆలియా చేరుతారని స్పష్టం చేశారు.
ఇదే విషయమై ఆలియా సన్నిహితులు కూడా మాట్లాడారు. ఎవరో కావాలని ఆమె పేరు దెబ్బతీసేందుకే ఇలాంటి వదంతులు సృష్టిస్తున్నారని అన్నారు. ఆలియా ప్రతిభ చూసే దర్శకుడు రాజమౌళి ఎంచుకున్నారని, ఆయన తన నిర్ణయానికి కట్టుబడి ఉంటారని చెప్పారు.