"ఒక నటి ముందడుగు వేయడానికి కాస్త ప్రోత్సాహం చాలు. అలాంటిది తెలుగు ప్రేక్షకులు నాపైన ఎంతో ప్రేమను ప్రదర్శిస్తుంటారు. హైదరాబాద్ ఎప్పుడూ నా రెండో ఇల్లు అని భావిస్తుంటా" అని అంటోంది ప్రియా ప్రకాశ్ వారియర్. కన్నుకొట్టే వీడియోతో సంచలనం సృష్టించిన ఆమె ప్రపంచం మొత్తానికీ పరిచయం. తెలుగులో 'లవర్స్‌డే', 'చెక్' చిత్రాలతో సందడి చేసింది. ఇటీవల 'ఇష్క్'లో నటించింది. ఆ చిత్రం ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రియా ప్రకాశ్ మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది. ఆ విషయాలివీ...
"ఇది నా తొలి తెలుగు సినిమా అనిపిస్తోంది. ఎందుకంటే 'చెక్'లో నేను చేసింది చిన్న పాత్రే. 20 నిమిషాలకు మించి కనిపించను. ఇందులో సినిమా మొత్తం కనిపిస్తా. నిజానికి 'ఇష్క్' అనూహ్యంగా వచ్చిన అవకాశం. మామూలుగా కథ విన్నాక కొంచెం ఆలోచించి, దర్శకుడితో చర్చించి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటాం. ఈ సినిమాకు మాత్రం రెండు రోజుల్లోనే నిర్ణయం తీసుకొని సెట్లోకి అడుగుపెట్టా. మలయాళం 'ఇష్క్' నేను చూశా. అది నాకు బాగా నచ్చింది. దాంతో ఎక్కువగా ఆలోచించకుండా రంగంలోకి దిగా".
"మనం తరచూ చూసే ప్రేమకథల్లా ఉండదు ఈ చిత్రం. ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తుంది. యువతరం తమ జీవితాల్లో ఎదుర్కొనే ఓ కీలకమైన సమస్యను స్పృశిస్తుంది. ఆ సమస్య ఏమిటనేది తెరపైనే చూడాలి. దర్శకుడు ఇందులోని అను పాత్రను నాదైన శైలిలోనే చేయమని చెప్పారు. అదే చేశా. ప్రేక్షకులకు నా నటన కచ్చితంగా నచ్చుతుందని నమ్ముతున్నా".