టాలీవుడ్‌లో మళ్లీ మంచిరోజులు రాబోతున్నాయి. పెద్ద తెరమీద సినిమా మాజాను ఆస్వాదించాలనుకునే సినీప్రేమికుల కల మళ్లీ నెరవేరబోతోంది. ఒక్కొక్కటిగా సినిమాలు థియటర్ విడుదలకు మొగ్గు చూపుతున్నాయి. తేజ సజ్జా, ప్రియా ప్రకాశ్ వారియర్ జంటగా నటించిన 'ఇష్క్'ను థియేటర్‌లోనే విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. జూలై 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఈ సినిమాను ఎస్.ఎస్.రాజు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఆర్.బి.చౌదరి సమర్పణలో ఎన్.వి.ప్రసాద్, పరాస్ జైన్, వాకాడ అంజన్‌కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం అందించారు.
డయల్ 100..
సస్పెన్స్ థ్రిల్లర్‌లను ఇష్టపడే ప్రేక్షకులకు ముందుకు మరో ఆసక్తికర చిత్రం రానుంది. మనోజ్ బాజ్‌పాయ్, నీనా గుప్తా కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'డయల్ 100'. రెన్సిల్ డిసిల్వా దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 6న జీ5 వేదికగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్ విడుదలైంది.
పోలీస్ ఎమర్జెన్సీ సర్వీస్ సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ పోలీస్ అధికారికి ఫోన్ కాల్ వస్తుంది. ఒక మహిళ ఏడుస్తూ 'నేను చనిపోవాలనుకుంటున్నా' అని చెబుతుంది. అందరూ అది ఫేక్ కాల్ అనుకుంటారు. కానీ, కొద్దిసేపటి తర్వాత మళ్లీ ఆ మహిళ ఫోన్ చేసి, 'బిడ్డను కోల్పోవడం అంటే ఏంటో మీకు తెలుసా? నాకు తెలుసు' అని ఆ మహిళ సమాధానం ఇస్తుంది. ఇంతకీ ఆ మహిళ ఎవరు? ఆ పోలీస్ ఆఫీసర్‌కూ, మహిళకూ ఉన్న సంబంధం ఏంటి? ప్రమాదంలో పడిన తన కుటుంబాన్ని పోలీస్ ఆఫీసర్ ఎలా కాపాడుకున్నాడు? అన్నదే 'డయల్ 100'. సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా పతాకంపై ఈ సినిమా నిర్మితమైంది.
'జ' ట్రైలర్..
ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తూ వినోదం పంచేందుకు మరో హార్రర్ థ్రిల్లర్ చిత్రం సిద్ధమవుతోంది. సైదిరెడ్డి చిట్టెపు దర్శకత్వంలో బిగ్‌బాస్‌ఫేమ్ హిమజ, ప్రతాప్‌రాజ్ ప్రధానపాత్రల్లో 'జ' తెరకెక్కుతోంది. జబర్దస్త్ కమెడియన్లు సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ప్రీతి నిగమ్, చత్రపతి శేఖర్ కీలకపాత్రలు పోషించారు. కందుకూరి గోవర్ధన్‌రెడ్డి నిర్మాత. ఇప్పటికే విడుదలైన చిత్ర పోస్టర్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను యువ కథానాయకుడు సుధీర్‌బాబు మంగళవారం విడుదల చేశారు. డైలాగ్‌లేవీ లేకుండా కేవలం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తోనే సాగుతూ ట్రైలర్ ఆసక్తి రేకెత్తించేలా ఉంది. 'జ' అంటే జన్మ లేదా పుట్టుక అని అర్థం. ఈ టైటిల్ ఎందుకు పెట్టామనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందేనని, మంచి కథా బలం ఉన్న చిత్రమని నిర్మాత అన్నారు.
ఇదీ చదవండి:బాలయ్య-పూరీ జగన్నాథ్ కాంబోలో మరో చిత్రం