"తెలుగు సినీ పరిశ్రమ నుంచి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. మంచి కథ కోసం ఎదురు చూస్తూ వచ్చా. ఇంతలో దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి సర్ నుంచి ఫోన్ వచ్చింది. ఆయన తీసిన ‘మనమంతా’ సినిమా మలయాళంలో ‘విస్మయం’ పేరుతో వచ్చింది. నాకు బాగా నచ్చిన చిత్రమది. అది చూశాక ఈయన ఎంత గొప్ప దర్శకుడో అర్థమైంది. ఆయనే ఫోన్ చేసి ‘చెక్’లోని యాత్ర అనే పాత్రలో నువ్వు నటించాలని చెప్పగానే వెంటనే అంగీకారం తెలిపా. తెలుగులో నేను చేయడానికి సరైన సినిమా ఇదే అనిపించింది. అలా చెక్ సినిమాతో తెలుగులో నా ప్రయాణం మొదలైంది".
యాత్ర... నేను
"సాహసాలకి వెనకాడని అమ్మాయి యాత్ర. కొన్ని విషయాల్లో నేను, యాత్ర ఒకలాగే ఉంటాం. ఆ పాత్రలోని సరదాతనం నా నిజ జీవితంలోనూ కొంచెం ఉంటుంది. అందుకే ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా సన్నద్ధం కావాల్సిన అవసరం రాలేదు. అయితే చిత్రీకరణకు ముందు స్క్రిప్ట్ రీడింగ్ సెషన్ జరిగింది. దర్శకులు ముందే నాకు స్క్రిప్టు ఇచ్చి, నా పాత్రకు సంబంధించిన సంభాషణల్ని చదవమని చెప్పారు. వాటికి అర్థం తెలుసుకుంటూ నేను సిద్ధమయ్యా. మనం చెప్పాల్సిన సంభాషణల భావం తెలిస్తే మరింత బాగా నటించగలం. నా పాత్ర గురించి ఇప్పుడేమీ చెప్పలేను కానీ... 'చెక్' అనేది ఆదిత్య ప్రయాణం. అతని ప్రయాణంలో యాత్ర ముఖ్యమైన భాగం. అదెలా అనేది తెరపైనే చూడాలి. నితిన్ సీనియర్ నటుడు కావడం వల్ల మొదట భయపడ్డా. కానీ సెట్లో తనతో కలిసి పనిచేయడం సౌకర్యంగా అనిపించింది. తెలుగులో 'చెక్'తోపాటు, 'ఇష్క్' అనే మరో సినిమా చేశా. ఇప్పుడు తెలుగు బాగా అర్థం అవుతోంది. కొంతవరకు మాట్లాడతాను కూడా. ఇంకొన్ని సినిమాల తర్వాత సొంతంగా డబ్బింగ్ చెప్పుకొంటా".
అస్సలు వదలుకోను
"దక్షిణాదిలో తమిళంలో తప్ప మిగతా మూడు ప్రధాన భాషల్లోనూ నటించా. హిందీలోనూ చేశా. ఒక భాషకు పరిమితం కాకుండా... ఎక్కడ మంచి కథ వస్తే అక్కడ నటిస్తూ ప్రయాణం చేస్తా. తమిళంలో ఇంకా నటించలేదు కాబట్టి.. అక్కడా తొందరగా ఓ సినిమా చేసేయాలని ఉంది. నటనతోపాటు... నృత్యం, సంగీతంలోనూ నాకు ప్రవేశం ఉంది. కర్ణాటక సంగీతంలో శిక్షణ తీసుకున్నా. 'చెక్' సెట్లో నేను పాడటం చూసి దర్శకులు ఆశ్చర్యపోయారు. సినిమాలో నాతో పాడించాలనుకున్నారు కానీ... కుదరలేదు. కన్నడలో నేను నటించిన 'విష్ణుప్రియ' సినిమాలోనూ పాట పాడా. మలయాళంలోనూ పాడా. తెలుగు, హిందీల్లో ఆల్బమ్ గీతాలు ఆలపించా. సినిమాల్లో పాడే అవకాశం వస్తే అస్సలు వదులుకోను’’.