91వ అకాడమీ అవార్డుల ప్రదర్శనలో ర్యాంపుపై సందడిచేయనున్నారు ఆస్కార్ నామినీలు. ఫిబ్రవరి 24న జరిగే మూడు గంటల వేడుక కోసం ముందుగా సన్నద్ధం కావాలి కదా.. అందుకే ఆస్కార్ ఫిలిం అకాడమీ అధ్యక్షుడు జాన్ బైలీ ఓ ప్రైవేటు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆస్కార్ బరిలో ఉన్న నటీనటులంతా పాల్గొన్నారు.
విజేతలను ప్రకటించేటప్పుడు ఎలా ఉంటుందో కొందరు ఉత్సాహంగా వివరించారు. కార్యక్రమానికి ఉత్తమ నటీమణులుగా నామినేషన్లో ఉన్న గ్లెనెన్ క్లోజ్, లేడీ గాగా, దర్శకురాలు సైక్ లీసా, నటులు మహెర్షలా అలీ, రమీ మాలిక్ వంటి ప్రముఖులు హజరయ్యారు. ఫొటోలకు ఫోజులిచ్చారు.
సరదా సంభాషణలు
ఈ ప్రఖ్యాత వేడుకకు ప్రతి ఏటా వచ్చేవారు మారుతుంటారు. అందులో కొత్త నటుల నుంచి ఎన్నోసార్లు ఆస్కార్లు అందుకున్న వారూ ఉంటారు. మరి వారందరి మధ్య మంచి అనుబంధం ఏర్పరచాలనే ఉద్దేశంతో ఈ పార్టీ ఏర్పాటు చేశారు. నటీనటులు సరదాగా మాట్లాడుకున్నారు. రోమా చిత్ర డైరెక్టర్ ఆల్ఫాన్సో...గ్రీన్ బుక్ దర్శకుడు పీటర్తో ముచ్చటించారు. తన తోటి నామినీ నటి యాలిట్జా అపారిషియో టేబుల్ దగ్గరకు పరుగెత్తుకొని వెళ్లి మరీ సంభాషించింది లేడీ గాగా.
ఇక్కడున్న వారికోసం కాకుండా కుటుంబసభ్యులు, వీక్షకులు, అభిమానుల కోసం కొన్ని మాటలు చెప్పాలని కోరారు అధ్యక్షుడు జాన్ బైలే. అనంతరం నటీనటులు అందరూ కలిసి ఆస్కార్ అవార్డు నమూనా వద్ద ఫోటోలు దిగారు.