ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్(prakash raj movies) తెలుగు నిర్మాతల మండలి తనను ఎందుకు బ్యాన్ చేసిందన్న విషయాన్ని వెల్లడించారు. ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా(alitho saradaga latest episode) కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు విషయాలు పంచుకున్నారు. ఆయన అమ్మానాన్నల లవ్ స్టోరీ, సినిమాల్లోకి వచ్చాక పేరు మార్చుకోవడం, తెలుగు నేర్చుకోవడం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
- దర్శకుడు బాలచందర్ నా పేరు మార్చారు. మద్రాసులో ఓసారి ఆయన్ని కలిశాను. ఆ తర్వాత ఎనిమిది, తొమ్మిది నెలలకు ఆయన నుంచి ఫోన్ వచ్చింది. 'నా సినిమాలో పాత్ర ఉంది వచ్చేయ్' అన్నారు. అదే 'డ్యూయెట్' సినిమా. ఆ సినిమా షూటింగ్లో ఆయన నా పేరు మార్చాలి అన్నారు. ఆర్టిస్టుల పేర్లు యూనిక్‌గా ఉండాలన్నారు. అలా నా పేరును ప్రకాశ్ రాయ్ నుంచి ప్రకాశ్ రాజ్‌గా మార్చారు.
- తెలుగులో మొదటి సినిమా సాయి బ్రదర్ రవి డబ్ చేశారు. ఈ సినిమా డబ్బింగ్ సమయంలో ఎంతసేపూ అలా కాదు, అలా కాదు అంటుంటే గెటౌట్ అన్నారు. బాలసుబ్రహ్మణ్యం గారి స్టూడియో బయటకు వచ్చి ఏడ్చాశాను. అప్పుడు ఆయన అన్నారు 'నువ్వు తెలుగు భాష నేర్చుకోవాలి, తెలుగు మాట్లాడాలి' అని. నాకు భాష నేర్చుకోవడం ఇష్టం. ఒక భాషను నేర్చుకోవడం అంటే ఆ భాషను గౌరవించడం. వాళ్ల సంస్క్రతిని గౌరవించడం. మొత్తం ఎనిమిది భాషల్లో అనర్గళంగా మాట్లాడగలను. కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం, ఇంగ్లీష్, హిందీ, తుళూ మాట్లాడతా.
- మొత్తం ఇప్పటివరకు ఐదు నేషనల్ అవార్డులు వచ్చాయి. 'ఇరువర్', 'అంతఃపురం', 'ఖడ్గం', స్పెషల్ జ్యూరీ, 'ఖాంజీవరం', 'పుట్టక్కన హైవే' (నిర్మాతగా) చిత్రాలకు జాతీయ అవార్డులు వచ్చాయి.
తెలుగు నిర్మాతలు ఎందుకు బ్యాన్ చేశారు?
- ఎప్పుడూ నేను ఒక్క డేట్‌ను ఇద్దరికీ ఇవ్వలేదు. నేనెపుడూ మేనేజర్‌ను పెట్టుకోలేదు. కొన్నిసార్లు 'మీరెపుడైనా రండి, కానీ సంతకం పెట్టండి' అంటారు.. అలా కొన్నిసార్లు కుదరకపోవచ్చు, మరికొన్నిసార్లు చెప్పే కథ వేరే ఉంటుంది, వేరేలా తీస్తుంటారు. నాకు నచ్చదు. అలాంటపుడు గొడవలుంటాయి. 25 ఏళ్లలో 3,4 సార్లు బ్యాన్ అయి ఉండొచ్చు. 5,6 సార్లు బ్యాన్ నుంచి తప్పించుకొని ఉండొచ్చు. వీటి నుంచి నేను పాఠాలు నేర్చుకుని ఉండొచ్చు. అలా ముక్కుసూటిగా ఉండటం వల్ల కొన్ని పొందాను, కొన్ని కోల్పోయాను. నాకు జీవితంలో పక్వత చాలా ఆలస్యంగా వచ్చిందనుకుంటా. అదే మనస్తత్వం ఇప్పుడుందా? అంటే లేదు.
- ఒకసారి సెట్లో ఒక అమ్మాయిని రాళ్లతో కొడుతున్నారంటే.. ఆయన్ని పట్టుకొని తోసేశాను. దానికి ఆయన్ని కొట్టానంటూ బ్యాన్ చేశారు. ఓసారి ఒకరు పోషించిన పాత్ర వారికి నచ్చక, నాతో రీషూట్ చేయాలనుకుంటే.. 'ఒకరు చేసిన పాత్రను ఎలా చేయగలను'.. అన్నందుకు బ్యాన్ చేశారు. మొదటిసారి బ్యాన్ అయింది మహేశ్ బాబు సినిమా సమయంలో. అప్పుడు ఆగస్టులో షూటింగ్ అన్నారు అది అక్టోబర్ దాకా వెళ్లింది. అప్పుడు నా దగ్గర డేట్స్ లేవు. 'మేము వేరే వాళ్లని పెట్టుకుంటాం' అన్నారు. 'సరే' అన్నా. పేపర్లలో మాత్రం 'ప్రకాశ్ రాజ్‌ను తీసేసి వేరే వాళ్లని పెట్టుకున్నాం' అంటూ వచ్చింది. నాకు కోపం వచ్చి 'అలా ఎలా చెబుతారు. నాకు 3 లక్షలు ఇవ్వాలి. ప్రకాశ్ రాజ్ డేట్స్ లేవు కాబట్టి వేరే వాళ్లను తీసుకున్నామని రాయండి' అన్నా. ఇప్పుడు ఇవన్నీ అనవసరం అనిపిస్తుంది.
ఇవే కాక 'ఆగడు' సినిమా సమయంలో తనను కాదని సోనూసూద్‌ను పెట్టుకోవడంపైనా స్పందించారు ప్రకాశ్ రాజ్. ఆ విషయాలు తెలియాలంటే ఈ వీడియో చూసేయండి.