మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల (MAA Elections) ప్రచారం తెలుగు సినీ పరిశ్రమలో ఊపందుకుంది. అధ్యక్ష పీఠం కోసం పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారంలోకి దిగారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు విందు రాజకీయాలకు తెర తీశారు. తాజాగా ప్రకాశ్‌రాజ్ (Prakash Raj MAA elections) సినీ కళాకారులను కలిసి.. సమస్యల గురించి వారితో చర్చించారు. అంతేకాకుండా కళాకారులకు ఆదివారం నగరంలోని ఓ ప్రముఖ ఫంక్షన్ హాల్‌లో విందు ఏర్పాటు చేశారు. దీనిని తప్పుబడుతూ మాట్లాడారు నటుడు బండ్ల గణేశ్. ఆర్టిస్టుల జీవితాలతో ఆడుకోవద్దని సూచించారు.
బండ్ల గణేశ్ కౌంటర్
'మా' ఎన్నికల వేళ.. విందు రాజకీయాలు జరుగుతున్నాయంటూ వస్తోన్న ప్రచారాలపై బండ్ల గణేశ్ (Bandla Ganesh election) స్పందించారు. విందుల పేరుతో ఆర్టిస్టుల జీవితాలతో చెలగాటాలు ఆడొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది జరగనున్న 'మా' ఎన్నికల్లో జనరల్ సెక్రటరీ పదవి కోసం పోటీ చేసేందుకు సిద్ధమైన గణేశ్ తాజాగా ట్విట్టర్ వేదికగా ఓ వీడియో విడుదల చేశారు.
"విందులు, సన్మానాల పేరుతో 'మా' కళాకారులందరినీ ఒక్కచోటకు చేర్చొద్దు. రెండేళ్లుగా ప్రతి ఒక్కరు కరోనా భయాలతో బతుకుతున్నారు. నాలాంటివాళ్లు ఎందరో చావుదాక వెళ్లొచ్చారు. మీకు ఓటు కావాలంటే.. ఆర్టిస్టులందరికి ఫోన్ చేసి.. మీరు చేయాలనుకున్న అభివృద్ధి కార్యకలాపాలు, కార్యక్రమాల గురించి చెప్పండి. అంతేగాని విందుల పేరుతో వారి జీవితాలతో చెలగాటం ఆడొద్దు. ఇదే నా విన్నపం."
- బండ్ల గణేశ్
ఆర్టిస్టులతో విందు సమావేశం ముగిసిన తర్వాత బండ్ల గణేశ్ మ ాటలపై స్పందించారు ప్రకాశ్ రాజ్. "బండ్ల గణేశ్ కంటే నాకు 'మా' ముఖ్యం. గణేశ్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం. ఎన్నికలప్పుడు ప్రశ్నించని ఆయన ఇప్పుడెందుకు ప్రశ్నిస్తారు. అందరినీ అన్నివేళల మెప్పించలేం. 'మా' ఎన్నికలంటే యుద్ధమో, క్రికెట్ మ్యాచో కాదు. అసోసియేషన్‌లో చాలామంది సభ్యులు క్రియాశీలకంగా లేరు. కొంతమంది హీరోలు సభ్యులుగా ఉన్నప్పటికీ ఓటు వేయడానికి ముందుకు రావడం లేదు. కళాకారుల సంక్షేమం, పిల్లల విద్య, వైద్యం కోసం కార్యాచరణ రూపొందించాం. కేవలం 6 నెలల్లోనే నా పనితనాన్ని చూపిస్తా. 'మా' మసకబారడానికి కొందరు మాత్రమే కారణం" అంటూ మాట్లాడారు ప్రకాశ్ రాజ్.
ఇదీ చూడండి:MAA Elections: 'అక్కా! నీ మీద గెలుస్తా.. నీ ఆశీస్సులు కావాలి'