తెలుగు చిత్ర పరిశ్రమలో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. త్వరలో జరగబోయే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో అధ్యక్షుడిగా విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్(Prakash raj) బరిలో దిగనున్నారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రకాశ్‌రాజ్ తెలిపారు. దీంతో ప్రకాశ్‌రాజ్‌కు పోటీగా ఎవరు బరిలోకి దిగుతారు? ఆయనకు ఎవరి మద్దతు ఉంటుంది? ఇలా అనేక అంశాలపై అడిగిన ప్రశ్నలకు ఆయన తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
చిరంజీవి(Chiranjeevi) మద్దతు మీకు ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి? మీరేమంటారు? అన్న దానికి ప్రకాశ్‌రాజ్ సమాధానం ఇస్తూ.. "చిరంజీవి అందరి వ్యక్తి. ఆయన వ్యక్తిగతంగా ఏ ఒక్కరికో మద్దతు ఇవ్వరు. మంచి చేస్తారని ఆయన భావించినవారికి మద్దతిస్తారు. అన్నయ్యతో నాకున్న సాన్నిహిత్యాన్ని దీని కోసం వినియోగించుకోను" అని సమాధానం ఇచ్చారు.
'నా వంతుగా..'
తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న సమస్యల గురించి తనకు పూర్తిగా అవగాహన ఉందని, వాటిని అధిగమించడానికి తన వద్ద సరైన ప్రణాళిక ఉందన్నారు. ఇతర చిత్ర పరిశ్రమలతో పోలిస్తే చాలా విషయాల్లో తెలుగు చిత్రపరిశ్రమ చాలా పెద్దదన్న ప్రకాశ్‌రాజ్.. ఒకప్పుడు ఉన్న పేరు ప్రఖ్యాతలు ఇప్పుడు లేవని, దేశవ్యాప్తంగా 'మా'(Movie Artist Association-MAA)కు అత్యున్నత గౌరవం తీసుకొచ్చేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు.