'మా' ఎన్నికల్లో(maa elections 2021) అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిన ప్రకాశ్‌రాజ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు(maa elections prakash raj). 'మా' ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
" మా ఎన్నికలు బాగా జరిగాయి. ఎప్పుడూ లేనంత చైతన్యంతో దాదాపు 650మంది ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు. మంచు విష్ణు, శివబాలాజీ రఘుబాబుతో సహా గెలిచిన వారందరికీ పేరు పేరునా శుభాకాంక్షలు. మీరు అతి పెద్ద ప్రణాళికతో వచ్చారు. మీరిచ్చిన హామీలు నెరవేర్చండి. కానీ, ఈ రోజు నేను తెలుగువాడిని కాదు, ప్రాంతీయత, జాతీయవాదం వీటి నేపథ్యంలో మా ఎన్నికలు జరిగాయి. 'తెలుగు వ్యక్తి కాని వాడు ఓటు వేయవచ్చు. కానీ ఎన్నికల్లో పోటీ చేయకూడదు' అనే నినాదం ప్రారంభించారు. మీరు వచ్చిన తర్వాత ఆ నిబంధనలు మారుస్తానని కూడా చెప్పారు. నా తల్లిదండ్రులు తెలుగువారు కాకపోవడం నా తప్పు, వాళ్ల తప్పు కూడా కాదు. అసోసియేషన్‌కు నాయకత్వం తెలుగువారికే ఉండాలని అన్నారు. దాన్ని మెంబర్స్ ఆమోదించారు. తెలుగుబిడ్డ, మంచి వ్యక్తిని ఎన్నుకున్నారు. దాన్ని నేను స్వాగతిస్తున్నా. ఒక కళాకారుడిగా నాకంటూ ఆత్మగౌరవం ఉంటుంది. అందువల్ల 'మా' ప్రాథమిక సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నా. ఇది బాధతో తీసుకున్న నిర్ణయం కాదు. ప్రేక్షకులకు నాకూ ఉన్న బంధం సినిమాలతో కొనసాగుతుంది. వచ్చే రోజుల్లో నేను అతిథిగా ఉండాలంటే అసోసియేషన్ మెంబర్‌గా ఉండకూడదు. కొందరు నన్ను అతిథిగా మాత్రమే ఉండమన్నారు. పెద్ద నటులు మోహన్‌బాబుగారు, కోటగారు, చలపతిరావు తనయుడు రవి వీళ్లంతా 'అతిథిగా వస్తే, అతిథిగానే ఉండాలి' అని చెప్పారు. అలాగే ఉంటా. మీరు అనుకున్నది జరిగింది. 'మా' ఎన్నికల్లో జాతీయవాదం వచ్చింది. భాజపా నేత బండి సంజయ్‌లాంటి వాళ్లు ట్వీట్ చేశారు. ఎలా ఓడిపోయాం. ఎలా గెలిచాం అన్నది ముఖ్యం కాదు. ఎన్నికలు జరిగాయి. వాళ్లు గెలిచారు. 'మా'తో నాకు 21ఏళ్ల అనుబంధం. జీవితం ఎంతో అందమైది."