మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(maa elections 2021) ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ విషయంలో తనకు అన్యాయం జరిగిందని అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న ప్రకాశ్‌రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికల్లో మా అసోసియేషన్ చరిత్రలోనే జరగనంత ఓటింగ్ జరగబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆదివారం జరిగే ఎన్నికల కోసం జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు పరిశీలించారు. ఏర్పాట్లపై ఇరువురు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఇద్దరు.. ఎవరికి వారే గెలుపు ధీమా వ్యక్తం చేశారు. మా సభ్యులంతా తనవైపే ఉన్నారని మంచు విష్ణు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి విందుకు 300 మంది సభ్యులను ఆహ్వానిస్తే 500 మంది వచ్చి తనకు మద్దతు ఇచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే ఇతర ప్రాంతాల్లో ఉన్న తెలుగు నటీనటులు సైతం విమానాల్లో వచ్చి తనకు ఓటు వేస్తారని మంచు విష్ణు ఆశాభావం వ్యక్తం చేశారు.