ప్రకాశ్‌రాజ్.. ఓ భావాల పుట్ట. అభినయంలో దిట్ట. ఆయనో చిన్న సంభాషణ చెబితే చాలు.. ఆయనకొక చిన్న ముఖ కవళిక చాలు.. ఆ సన్నివేశం తన వశం కావల్సిందే. చేసే పాత్రకు ప్రత్యేకమైన వన్నె చేకూరాల్సిందే! అవలీలగా పాత్రల్లో ఒదిగిపోయే విలక్షణ నటుడు.. ప్రకాశ్‌రాజ్. ఇటీవల విడుదలైన 'వకీల్‌సాబ్'తో మరోసారి నందాగా మెరిశారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో ముచ్చటించారు.
"తెలుగు ప్రేక్షకులకు జీవితంలో ఓ భాగం సినిమా. ఇప్పుడొచ్చిన సినిమానే కాదు, వాటి వెనకటి సినిమాల్ని కూడా గుర్తు చేసుకుంటుంటారు. 'బద్రి' సినిమాలో ఉన్న నందానీ, బద్రిని ఇంకా ఎవ్వరూ మరిచిపోలేదు. నువ్వు నందా అయితే నేను బద్రి అని ఇప్పటికీ మాట్లాడుతుంటారు. అదొక అందమైన విషయం. అందుకే ఆ పాత్రల్ని సృష్టించిన పూరి జగన్నాథ్‌కు మరోసారి థ్యాంక్స్ చెప్పా. 'వకీల్‌సాబ్' విషయంలో నా పాత్రకు నందకిశోర్ అనే పేరు పెట్టడం దర్శకుడు శ్రీరామ్ వేణు మాస్టర్ స్ట్రోక్ అని భావిస్తాను. సినిమాలో నందాజీ అని పవన్‌కల్యాణ్ డైలాగ్ చెప్పేసరికి ప్రేక్షకులు 'బద్రి' సినిమాను గుర్తు చేసుకున్నారు. ఒక సినిమా మంచి జ్ఞాపకాల్ని తీసుకురావడం మంచి పరిణామం కదా".
- పవన్‌కల్యాణ్‌లాంటి ఓ కథానాయకుడు సినిమా చేస్తున్నప్పుడు ప్రేక్షకులు దేని కోసం థియేటర్‌కు వస్తారో తెలుసుకొని, వాళ్లకు ఆ కోణంలో సంతృప్తినిస్తూనే చెప్పాల్సిన కథనూ చెప్పాలి. ఆ విషయాన్ని దర్శకనిర్మాతలు అర్థం చేసుకుని ఈ సినిమాను చేశారు. ఆఖరికి థియేటర్ నుంచి బయటికొచ్చేసరికి చెప్పిన విషయమే జనాల్లో ఉంటుంది కదా. పవన్ ఆలోచలకు తగ్గ కథ ఇది. అభిమానులు పాటలు, ఫైట్లను ఆశిస్తారు కాబట్టి అవి కూడా జోడిస్తూ సినిమాను తీర్చిదిద్దారు. ఓకే అయిన సన్నివేశాల్ని మాత్రమే తెరపై చూస్తున్నారు కానీ.. దాని వెనక చాలా పెద్ద ప్రయాణం ఉంది. దర్శకుడు సందర్భాల్ని, సంభాషణల్ని సృష్టించిన విధానం, ఈ సినిమా కోసం ఆయన చేసిన హోమ్ వర్క్, మేం చేసిన రిహార్సల్స్ ఇలా చాలా కథే ఉంది. మేం ఈ సినిమా సెట్‌కు, కోర్టుకు వచ్చినట్టుగానే వచ్చేవాళ్లం. లంచ్‌కు అందరూ కూర్చుని స్క్రిప్ట్ గురించి మాట్లాడుకునేవాళ్లం. అంత నిబద్ధతతో పనిచేశాం కాబట్టే సినిమా ఇంతగా ప్రేక్షకులకు చేరువైంది. మహిళల నేపథ్యంలో సాగే ఇలాంటి కథలు ఇంకా రావాలి, మగాళ్లు మారాలి, గౌరవించడం నేర్చుకోవాలి. ఇంకా ఎన్ని రోజులు రాక్షసుల్లా బతుకుతాం? తల్లిదండ్రుల పెంపకంలోనే ఆ ఆలోచనా విధానం రావాలి. రాబోయే తరాలకు అది చాలా అవసరం.