తెలంగాణ

telangana

ETV Bharat / sitara

MAA Election: అందుకోసమే 'మా' ఎన్నికల్లో పోటీ - maa association

'మా' అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనేది ఒక్క రోజులో తీసుకున్న నిర్ణయం కాదని ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ తెలిపారు. సెప్టెంబర్‌ నెలలో జరగనున్న ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం పోటీ చేయనున్న ఆయన గురువారం సాయంత్రం తన ప్యానెల్‌ని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన పలు విషయాలు పంచుకున్నారు.

prakash raj
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్

By

Published : Jun 25, 2021, 12:15 PM IST

Updated : Jun 25, 2021, 12:22 PM IST

మూవీ ఆర్టిస్ట్స్​ అసోసియేషన్‌ 'మా' అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనేది ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదని ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ అన్నారు. సెప్టెంబర్‌ నెలలో జరగనున్న ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం పోటీ చేయనున్న ఆయన గురువారం సాయంత్రం తన ప్యానెల్‌ని ప్రకటించారు. ఇందులో భాగంగానే శుక్రవారం ఉదయం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

ప్రకాశ్ రాజ్ ప్యానెల్

" 'మా'లో పోటీ చేయాలనేది ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదు. రెండేళ్ల నుంచే ఆలోచిస్తున్నా. గడిచిన ఏడాది కాలం నుంచి ప్యానెల్‌లో ఎవర్ని తీసుకోవాలి? చిత్రపరిశ్రమలో ఉన్న సమస్యలు పరిష్కరించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను."

-ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌

వాళ్లు వెలుగు లాంటి వాళ్లు..

"మోహన్‌బాబు, చిరంజీవి, నాగార్జున.. ఇలా ప్రతిఒక్కరిదీ ఒక్కటే తపన.. అసోసియేషన్‌ని అభివృద్ధి చేయడమే. ఈ మధ్యకాలంలో నేను ఎక్కువగా లోకల్‌, నాన్‌లోకల్‌ అని వింటున్నా. కళాకారులు లోకల్‌ కాదు యూనివర్సల్‌. కళాకారులు వెలుగులాంటి వాళ్లు. భాషతో వాళ్లకు సంబంధం ఉండదు. గతేడాది ఎన్నికల్లో నాన్‌లోకల్‌ అనే అంశం రాలేదు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది. ఇదేం అజెండా. నా అసిస్టెంట్స్‌కి ఇళ్లు కొని ఇచ్చినప్పుడు నాన్‌లోకల్‌ అనలేదు. రెండు గ్రామాలు దత్తత తీసుకున్నప్పుడు నాన్‌ లోకల్‌ అనలేదు."

ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్

అప్పుడు నాన్​ లోకల్ అనలేదు..

"తొమ్మిది నందులు తీసుకున్నప్పుడు, జాతీయ అవార్డు పొందినప్పుడు నాన్‌లోకల్‌ అనలేదు. అలాంటిది ఇప్పుడు ఎలా నాన్‌లోకల్‌ అంటున్నారు. ఇది చాలా సంకుచితమైన మనస్తత్వం. 'మా' ఎంతో బలమైన అసోసియేషన్‌. ఇది కోపంతో పుట్టిన ప్యానల్‌ కాదు. ఆవేదనతో పుట్టింది. ప్యానల్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టాలు ఎదుర్కొన్నవాళ్లే. ఇండస్ట్రీలో అనుభవం ఉన్నవాళ్లే. ఇది ఎంతో క్లిష్ట సమయం. మన గృహాన్ని ఇకపై మరింత పరిశుభ్రం చేసుకోవాలి. నేను అడిగానని కాదు.. అర్హత చూసి ఓటు వేయండి. ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రతిదానికి లెక్కలు చూపిస్తాం. మీరందరూ ఆశ్చర్యపడేలా మేము పనిచేస్తాం. ఈ మేరకు ప్రతిరోజూ అందరి పెద్దలతో మేము మాట్లాడుతున్నాం. ఎలక్షన్‌ డేట్‌ ప్రకటించే వరకూ మా ప్యానల్‌లోని ఎవరూ కూడా మీడియా ముందుకు రారు" అని ప్రకాశ్‌రాజ్‌ వివరించారు.

'మా' బృందం విజయవంతం

జయసుధ

అందరికీ నమస్కారం. 2021 'మా' అధ్యక్ష ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ పోటీ చేయనున్నారు. ఆయన ప్యానెల్లో మేము కూడా ఉన్నాం. ప్రకాశ్ రాజ్​కు నేను మద్దతు ఇస్తున్నా. ఆయన, నేను కలసి ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించాం. 2018లోనే తాను 'మా' అధ్యక్షుడిగా పోటీ చేయటంపై ఆసక్తి ఉన్నట్లు తెలిపారు. ప్రకాశ్ రాజ్ నాయకత్వంలో.. మా బృందం విజయవంతం అవుతుందని నాకు నమ్మకం ఉంది.

-జయసుధ, సీనియర్ నటి

'మా' బిడ్డలం..

నటుడు సాయి కుమార్

నేను మీ సాయి కుమార్. సినీ 'మా' బిడ్డలం. మనకోసం మనం. 'మా' కోసం మనం అనే నినాదంతో మా ఎన్నికల్లో పోటీ చేయనున్న ప్రకాశ్ రాజ్ ప్యానెల్​లో నేను సభ్యుడిగా ఉన్నందుకు సంతోషంగా ఉంది. మేము ఆయనకు పూర్తి మద్దతు ఇస్తున్నాం. మీ ఆదరాభిమానాలు, కళామతల్లి ఆశీర్వాదాలు 'మా'కు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై 'మా'.. జై 'హింద్'

-- సాయి కుమార్, ప్రముఖ నటుడు

ఇదీ చదవండి :బాలీవుడ్​కు 'నాంది'.. 'హనుమాన్​​'గా తేజ

Last Updated : Jun 25, 2021, 12:22 PM IST

ABOUT THE AUTHOR

...view details