తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Maa Elections: 'పవన్‌ మార్నింగ్‌ షో కలెక్షనంత ఉండదు మీ సినిమా బడ్జెట్' - prakash raj latest news

ఎవరి గురించైనా మట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని నరేశ్, మంచు విష్ణులను (Maa Elections) ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు ప్రకాశ్ రాజ్. పవన్​ వైపు ఉన్నారా? లేక ఇండస్ట్రీ వైపు ఉన్నారా? అని విష్ణు అడిగిన ప్రశ్నకు ఆయన ఘాటుగా స్పందించారు.

pawan kalyan news
ప్రకాష్ రాజ్

By

Published : Oct 1, 2021, 7:35 PM IST

తాను చెప్పని మాటలను చెప్పానని సినీ నటుడు, 'మా' మాజీ అధ్యక్షుడు నరేశ్‌ అబద్ధాలు ఆడుతున్నారని, ఆయన మర్యాదగా మాట్లాడటం నేర్చుకోవాలని ప్రకాశ్‌రాజ్‌ ధ్వజమెత్తారు. అక్టోబరు 10న 'మా' ఎన్నికలు (Maa Elections) జరగనున్న నేపథ్యంలో ఇటీవలే ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక అంశాలపై మాట్లాడారు. 'మీరు పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan News) వైపు ఉన్నారా? లేక ఇండస్ట్రీ వైపు ఉన్నారా?' అని మంచు విష్ణు (Vishnu Manchu MAA) ప్రశ్నించడం బాగోలేదని, పవన్‌ ఇండస్ట్రీ వ్యక్తి కాదా? అని ప్రకాశ్‌రాజ్‌ ప్రశ్నించారు.

"నేను తెలుగువాడిని కాదు. కర్ణాటకలో పుట్టా. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో నటుడిగా ఎదిగా. అంతమాత్రాన నేను ఎన్నికల్లో పోటీ చేయకూడదని 'మా' నియమాల్లో ఉందా? రెండుసార్లు జాతీయ అవార్డులు అందుకున్నా. 9 నందులు తీసుకున్నా. అవతలి ప్యానెల్‌లో ఎవరైనా ఉన్నారా? దీనిపై చర్చ పెడితే జనం నవ్వుతారు. ప్రకాశ్‌రాజ్‌ మీద ఏదో ఒకటి చెప్పాలని విమర్శలు చేయడం తగదు. తెలుగు భాష గురించి ఏ స్థాయిలో మాట్లాడటానికైనా నేను సిద్ధమే. తెలుగు భాష మాట్లాడినంత మాత్రాన తెలుగువారు అయిపోరు. ఆత్రేయ, చలం, తిలక్‌ ఎవరి గురించైనా చర్చ పెడితే మాట్లాడతా.. వ్యాకరణం, ఛందస్సు, అలంకారాలు దేని గురించైనా మాట్లాడే సత్తా నాలో ఉంది. అవతలి ప్యానెల్‌లో ఉన్న ఒక్క సభ్యుడిలోనైనా ఉందా? దమ్ముంటే ఎన్నికల్లో (Maa Elections) దిగాలి. కృష్ణుడినవుతా.. రథం ఎక్కుతా.. ఈ మాటలెందుకు? పవన్‌కల్యాణ్‌ ఇండస్ట్రీ వ్యక్తి కాదా? ఆయన ప్రసంగాన్ని విశ్లేషించాలి. మొదట ఆయన సినీ నటుడు. ఆ తర్వాతే రాజకీయ నాయకుడు. విష్ణు (Vishnu Manchu MAA)మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి. పవన్‌కల్యాణ్‌ మార్నింగ్‌ షో కలెక్షనంత లేదు మీ సినిమా బడ్జెట్‌. ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. మీకు పొలిటికల్‌ అజెండా ఉంటే మీరు చూసుకోండి. పవన్‌ (Pawan Kalyan News) సినీ నటుడు. ఆయన రాజకీయ అజెండా మాకొద్దు. ఏపీ రాజకీయాలు నాకు తెలియవు. ఇండస్ట్రీ పరంగా పవన్‌ రెండు, మూడు ప్రశ్నలు అడిగారు. అవి ఏ స్వరంతో అడిగారన్న దానిపై మనం చర్చించుకుందాం. 'మీరు పవన్‌కల్యాణ్‌ పక్కన ఉన్నారా? ఇండస్ట్రీ పక్కన ఉన్నారా' అంటూ నన్నెందుకు లాగుతున్నారు. ఆయనకు నాకూ సిద్ధాంత పరంగా విభేదాలు ఉన్నాయి. ఈ విషయాన్ని పవన్‌ స్వయంగా చెప్పారు. అయితే, సినిమా విషయానికొస్తే నేను నంద.. ఆయన బద్రి.. అయిపోయిందంతే. 'మా' ఎన్నికల్లో (Maa Elections) జగన్‌ను లాగొద్దు. ఆయన పాదయాత్ర చేసి, ప్రజల మనసు గెలుచుకుని సీఎం అయ్యారు. 'మా' అసోసియేషన్‌ గురించి ఆలోచించేంత సమయం ఆయనకు ఉండదు. కేసీఆర్‌ ఉద్యమం చేసి, ఒక సీఎం అయ్యారు. ఆయనకు చాలా పనులున్నాయి. ఇందులోకి వాళ్ల పేర్లు ఎందుకు లాగుతున్నారు"

-ప్రకాశ్‌రాజ్‌

ప్రకాశ్‌రాజ్‌కు ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంఘీభావం

నెల 10న 'మా' ఎన్నికలు (Maa Elections) జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్​ను హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో కలిశారు. ఆయన ప్యానల్‌ సంపూర్ణ మెజారిటీతో గెలవాలని ఆకాంక్షిస్తున్నట్లుగా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగే చిత్ర నిర్మాణాలలో స్థానిక కళాకారులకు అవకాశాలు కల్పించాలని, అందుకు ప్రకాశ్‌ రాజ్ తరపు నుంచి పూర్తి సహకారం కావాలని వారు కోరారు.

కలిసి పని చేద్దాం..

ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్‌ ఏపీ 'మా' ప్రతినిధులతో మాట్లాడుతూ.. "నేను విశ్వ నటుడిగా ఉన్నా. ఏ రాష్ట్రానికో, భాషకో పరిమితం చేయవద్దు. మా ఎన్నికలకు గానూ సినిమా పరిశ్రమకు సంబంధించిన ప్రతి కార్మికుడి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండే విధంగా భవిష్యత్తు కోసం ముందుకు వెళ్తున్నాం. మనం కళాకారులం.. కళాకారులుగానే ఉందాం, జీవిద్దాం. మనకు తెలిసింది నటన ఒక్కటే. మన సంక్షేమం కోసం మనం కలిసి పని చేద్దాం" అని అన్నారు. అనంతరం ఏపీ మా అధ్యక్షులు ఎం. కృష్ణ కిషోర్, కార్యదర్శి వై అప్పారావ్, వ్యవస్థాపక అధ్యక్షలు ఏ.ఎం.ప్రసాద్, కార్యనిర్వాహక కార్యదర్శులు సిహెచ్.రమేష్ యాదవ్, పూతి వెంకటరెడ్డి, జీఎస్ కళ్యాణ్.. ప్రకాశ్‌రాజ్​కు జ్ఞాపిక అందించారు.

ఇదీ చూడండి:Maa elections: 'పవన్​తో ఏకీభవించను.. ఆయన ఓటు మాత్రం నాకే'

ABOUT THE AUTHOR

...view details