'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడం వల్ల అధ్యక్ష బరిలో నిలిచిన ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణులు ప్రచార పర్వానికి తెరతీశారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఎవరికి వారు సభ్యుల మద్దతు కూడగట్టుకునేందుకు మంతనాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో ప్యానల్ ప్రకటించి ఒక అడుగు ముందే ఉన్న ప్రకాశ్‌రాజ్.. తనదైన మాటలతో కళాకారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా విందు సమావేశాలను ఏర్పాటు చేసి ఓటు హక్కు ఉన్న సభ్యులతోపాటు ఇతర కళాకారులందరిని ఒక్కచోట చేర్చి సినీ పరిశ్రమలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇటీవల తన ప్యానల్ సభ్యులతో కలిసి సుమారు 150 మంది సినీ, టెలివిజన్ కళాకారులతో సమావేశమైన ప్రకాశ్‌రాజ్.. అక్టోబర్ 10న జరిగే ఎన్నికల్లో తమ ప్యానల్ గెలిచినా గెలవకపోయినా రెండేళ్లపాటు సభ్యుల సంక్షేమ కోసం తమవంతు కృషి చేస్తామని ప్రకటించారు.
'మా' సభ్యుడిగా రెండేళ్ల నుంచి అసోసియేషన్‌లో జరుగుతున్న సంఘటనలను గమనిస్తున్నట్లు తెలిపిన ప్రకాశ్‌రాజ్.. సినీ పెద్దలు ఎంతో ఔదార్యంతో ఏర్పాటు చేసిన ఈ సంఘాన్ని గత కార్యవర్గ సభ్యులు మసకబార్చారని విమర్శించారు. సభ్యులకు అండదండగా ఉండాల్సిన 'మా'ను.. ఛారిటీ అసోసియేషన్ గా మార్చారని వ్యాఖ్యానించారు. 'మా'లో సభ్యుల సంఖ్యపై స్పష్టత లేదన్న ప్రకాశ్‌రాజ్.. 147 మంది స్థానికేతరులు అసోసియేషన్‌లో ఉన్నారని పేర్కొన్నారు. జెనీలియా లాంటి కథానాయికలు, రామ్ చరణ్, నాగచైతన్య లాంటి అగ్ర నటీనటులు ఈ ఎన్నికల్లో ఓటింగ్‌లో పాల్గొనడం లేదని, అలాంటి వాళ్లను తీసేస్తే కేవలం 250 మంది మాత్రమే నిజమై సభ్యులున్నారని వెల్లడించారు.
మూడు నెలల్లో హెల్త్ కార్డులు..
'మా' అసోసియేషన్ బాధ్యత వేషాలు ఇప్పించడమే కాదన్న ప్రకాశ్‌రాజ్.. వయస్సు రీత్యా వేషాలు వేయలేని నటీనటుల కుటుంబాల్లోని పిల్లల చదువులకు సహకారం అందించాలని కోరారు. మహేశ్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి నటులు తలుచుకుంటే అది సాధ్యమవుతుందన్నారు. సుమారు 100 మంది వైద్యులతో సంప్రదింపులు జరిపినట్లు వెల్లడించిన ప్రకాశ్‌రాజ్.. తమ ప్యానెల్ గెలిస్తే ఒక్కో వైద్యుడు ఐదుగురు సభ్యుల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తారని స్పష్టం చేశారు. అలాగే గెలిచిన మూడు నెలల్లోగా అసోసియేషన్ లో ప్రతి సభ్యుడికి హెల్త్ కార్డులు ఇస్తామని ప్రకటించారు. అంతేకాకుండా ఆరు నెలల్లో సభ్యుల సంక్షేమం కోసం 10 కోట్ల రూపాయలు కేటాయిస్తామని ప్రకాశ్ రాజ్ హామీ ఇచ్చారు.