అందం, అభినయం కలగలిసిన హీరోయిన్లలో ప్రగ్యా జైస్వాల్ ఒకరు. 'కంచె', 'జయ జానకి నాయక' తదితర చిత్రాలతో ఇదే అంశాన్ని చాటిచెప్పిన ముద్దుగుమ్మ 'అఖండ'తో మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు వస్తుంది. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న చిత్రమిది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై రవీందర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా డిసెంబరు 2న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రగ్యా మీడియాతో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
నా పాత్రే కీలకం..
ద్వారక క్రియేషన్స్ సంస్థలో నేను నటించిన రెండో చిత్రమిది. కొవిడ్ లాక్‌డౌన్ తర్వాత నాకు ఈ అవకాశం వచ్చింది. తాను రాసుకున్న పాత్రలకు ఎవరు న్యాయం చేయగలరో వారినే ఎంపిక చేసుకుంటారు దర్శకుడు బోయపాటి శ్రీను. అలా నేనీ ప్రాజెక్టులో అడుగుపెట్టాను. ఆయనపై నాకున్న నమ్మకంతో కథను పూర్తిగా వినకుండానే ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పా. నేనీ చిత్రంలో ఐఏఎస్ శ్రావణ్య అనే పాత్ర పోషించా. దర్శకుడు ఇచ్చిన సూచనల మేరకు కొత్తగా కనిపించే ప్రయత్నం చేశా. ఇందుకు ఎంతో శ్రమించా. నా కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ప్రేక్షకులు అందిస్తారని ఆశిస్తున్నా. సినిమాకే కీలకంగా నిలిచే పాత్ర అది. ఆ క్యారెక్టర్ చుట్టే కథ తిరుగుతుంది. ఆ పాత్రకు ఎదురైన కొన్ని సంఘటనల వల్ల కథానాయకుడి రెండో క్యారెక్టర్ 'అఖండ' దర్శనమిస్తుంది.
పాట కోసం ఎదురుచూస్తున్నా..
'అఖండ'లాంటి కథ, అందులోని పాత్రల్ని నేనింతవరకూ వినలేదు, చూడలేదు. తెలుగులోనే కాదు ఇతర చిత్ర పరిశ్రమల్లోనూ ఇలాంటి పవర్‌ఫుల్ సినిమా వచ్చుండదు. ఇందులోని పాటలు ఇతర కమర్షియల్ చిత్రాల్లో ఉన్నట్టుగా ఉండవు. ఈ సినిమా సంగీతంలో వైవిధ్యం ఉంది. వ్యక్తిగతంగా నాకు డ్యాన్స్ చేయడమంటే ఇష్టం. ఓ పాటలో నా నృత్య ప్రతిభను చూపించే అవకాశం వచ్చింది. ఆ పాట విడుదల కోసం ఎదురుచూస్తున్నా.