ఇటీవలే జార్జియాలో తన కొత్త చిత్ర షెడ్యూల్‌ను పూర్తి చేసుకొచ్చిన ప్రభాస్.. ప్రస్తుతం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తన ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉంటున్నాడు. అయితే ఇప్పుడీ హీరో కోసం ఓ ప్రత్యేక ఆస్పత్రిని నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. అదేంటి.. ఎందుకు ఇప్పుడింత అకస్మాత్తుగా ఆస్పత్రి నిర్మించడం అని కంగారు పడకండి. ఇది నిర్మిస్తోంది ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం కోసమే.
ప్రభాస్ కోసం ప్రత్యేక ఆస్పత్రి! - ప్రభాస్ కోసం ప్రత్యేక ఆస్పత్రి!
ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం ఇటీవలే జార్జియాలో షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రభాస్ ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నాడు. లాక్డౌన్ ముగిశాక మరో షెడ్యూల్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం.
70ల కాలంలో యూరప్ నేపథ్యంగా సాగే ఓ వైవిధ్యమైన ప్రేమకథతో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. దీనిలో భాగంగానే ఇటలీ నేపథ్యంగా కొన్ని కీలక షెడూళ్లను ప్లాన్ చేసింది చిత్రబృందం. కానీ, కరోనా పరిస్థితుల వల్ల ఇప్పుడా దేశం తీవ్రంగా దెబ్బతింది. ఇప్పుడక్కడ కనిపిస్తున్న పరిస్థితులు చూస్తుంటే మరికొన్ని నెలల పాటు అక్కడికి వెళ్లడమన్నది అసాధ్యమే అవుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ప్లాన్ చేసిన షెడ్యూళ్లను 'ప్రభాస్ 20' బృందం రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడ తెరకెక్కించాలనుకున్న కీలక ఎపిసోడ్లను హైదరాబాద్‌లోనే ప్రత్యేక సెట్లను నిర్మించి పూర్తి చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకున్నారట. ఇప్పటికే ఇందుకోసం ఏర్పాట్లు చేస్తోందట.
ప్రస్తుతానికి అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఓ ఆస్పత్రి సెట్‌ను నిర్మించే పనిలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం దేశంలో కరోనా పరిస్థితులు కాస్త కుదుటపడ్డాక.. ఈ సెట్లోనే చిత్రీకరణ ప్రారంభించాలని రాధాకృష్ణ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం 'రాధే శ్యాం', 'ఓ డియర్' అన్న పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసురానున్నట్లు సమాచారం.