తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మెరుపు వేగంతో ప్రభాస్​ కొత్త సినిమా.. ఓటీటీలోకి కరీనా - prabhas malavika mohan

Prabhas Upcoming Movie: వరుసగా భారీ బడ్జెట్​ సినిమాలు చేస్తుండటం వల్ల వెండితెరపై ప్రభాస్​ను చూడాలంటే ఏళ్ల పాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది! దీంతో మారుతి దర్శకత్వంలో చేయబోయే సినిమా షూటింగ్​ను త్వరితగతిన పూర్తి చేసి.. ఫ్యాన్స్​ను అలరించాలని భావిస్తున్నారు ప్రభాస్​. ఈ సినిమా సహా కరీనా కపూర్​, టైగర్​ ష్రాఫ్​, అజయ్​ దేవ్​గణ్​ కొత్త చిత్రాల విశేషాలపై ఓ లుక్కేయండి.

kareena kapoor new movie
kareena kapoor new movie

By

Published : Mar 17, 2022, 7:53 AM IST

Prabhas Upcoming Movie: 'రాధేశ్యామ్‌'తో థియేటర్లలో సందడి చేస్తున్న ప్రభాస్‌.. మరో సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్దమయ్యారు. వచ్చే నెలలోనే ఆ చిత్రం ప్రారంభం కానున్నట్టు సమాచారం. కొన్ని నెలల వ్యవధిలోనే, మెరుపు వేగంతో ఆ సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే వ్యూహంతో ఆయన సన్నద్ధమైనట్టు తెలుస్తోంది. మారుతి దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. ఇప్పటిదాకా భారీ చిత్రాలే చేస్తూ వచ్చారు ప్రభాస్. ఒప్పుకున్న సినిమాలు కూడా అలాంటివే. కానీ మారుతి దర్శకత్వంలో సినిమా మాత్రం భారీ హంగులతో కాకుండా.. ఆయన శైలి వినోదమే ప్రధానంగా రూపొందుతున్నట్టు తెలుస్తోంది. అందుకోసం శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ప్రభాస్

కథానాయికల ఎంపికపై దృష్టిపెట్టిన ఆ చిత్రబృందం.. ఇప్పుడు ఓ భారీసెట్‌ని తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉంది. హైదరాబాద్‌లోనే రూ.5 కోట్లకు పైగా వ్యయంతో ఓ ఇంటి సెట్‌ నిర్మాణానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా మాళవిక మోహనన్‌ నటిస్తోంది.

మాళవిక

ఇందులో మరో ఇద్దరు కథానాయికలకు చోటున్నట్టు తెలిసింది. అన్నీ అనుకున్నట్టుగా సాగితే ఈ ఏడాదిలోనే చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఈద్​కు టైగర్​..

'హీరో పంటి 2'

ఎనిమిదేళ్ల క్రితం 'హీరో పంటి'తో బాలీవుడ్‌కు పరిచయమయ్యాడు టైగర్‌ ష్రాఫ్‌. ఆ తర్వాత 'బాఘి' సిరీస్‌, 'వార్‌' తదితర చిత్రాలతో యాక్షన్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు 'హీరో పంటి 2'తో అలరించడానికి సిద్ధమయ్యాడు. తారా సుతారియా కథానాయికగా నటించింది. అహ్మద్‌ ఖాన్‌ తెరకెక్కించారు. సాజిద్‌ నడియాడ్‌వాలా నిర్మించారు. ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలందించారు. ఈద్‌ కానుకగా ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 29న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం బుధవారం ప్రకటించింది. ఈ సందర్భంగా టైగర్‌ ష్రాఫ్‌ పాత్రకు సంబంధించిన లుక్‌ను విడుదల చేసింది.

తారా సుతారియా

అందులో చుట్టూ ఉన్న రౌడీలు లేజర్‌ గన్నులను గురిపెట్టి ఉండగా, టైగర్‌ ష్రాఫ్‌ చేతిలో గన్నుతో సీరియస్‌గా చూస్తూ కనిపించారు. దీన్నిబట్టి ఈ చిత్రం భారీ యాక్షన్‌ సన్నివేశాలతో తెరకెక్కినట్లు అర్థమవుతోంది. తారా సుతారియా, నవాజుద్దీన్‌ సిద్దిఖీ లుక్‌లు కూడా ఆకట్టుకుంటున్నాయి.

తాన్​సేన్​గా అజయ్​!

బాలీవుడ్‌ కథానాయకుడు అజయ్‌ దేవ్​గణ్‌.. మరో ఆసక్తికరమైన పాత్రకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇటీవలే ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన 'గంగూబాయ్‌ కతియావాడి'లో కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఆ సినిమాతోపాటు ఆయన పాత్రకూ మంచి ప్రశంసలు దక్కాయి. ఈ నేపథ్యంలో భన్సాలీతో కలసి అజయ్‌ మరో సినిమా చేసే అవకాశాలున్నాయని సమాచారం.

అజయ్ దేవ్​గణ్

పీరియాడిక్‌ కథలను తనదైన శైలిలో తెరకెక్కించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు భన్సాలీ. ఇప్పుడు అదే తరహాలో 'బైజు బవ్రా'ను పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. ఇది ఓ రకంగా ఆయన కలల ప్రాజెక్టు. ఇందులో ప్రముఖ సంగీత విద్వాంసుడు తాన్‌సేన్‌ పాత్ర కీలకంగా ఉండనుంది. దానికి అజయ్‌ను ఎంపిక చేసే ఆలోచనలో భన్సాలీ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా వారిద్దరి మధ్య చర్చలు జరుగుతున్నట్లు బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. అన్నీ కుదిరితే తాన్‌సేన్‌గా అజయ్‌ కనిపించడం ఖాయమని తెలుస్తోంది.

ఓటీటీలో కరీనా..

బాలీవుడ్‌లో అగ్రకథానాయికగా వెలుగొందిన కరీనా కపూర్‌ ఇప్పుడు డిజిటల్‌ ప్రపంచంలోకి అడుగుపెడుతోంది. పలువురు ప్రముఖ నటుల దారిలోనే ఓటీటీ మాధ్యమం ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ కోసం ఓ చిత్రంలో నటించనుంది. 'కహానీ', 'బద్లా' లాంటి థ్రిల్లర్‌ చిత్రాలను తెరకెక్కించిన సుజయ్‌ఘోష్‌ దర్శకత్వంలో ఈ సినిమా చేయనుంది.

కరీనా

అత్యంత ప్రజాదరణ పొందిన జపనీస్‌ మర్డర్‌ మిస్టరీ నవల 'డివోషన్‌ ఆఫ్‌ సస్పెక్ట్‌ ఎక్స్‌' ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. 2005లో వచ్చిన ఈ నవల ఆధారంగా ఇప్పటికే పలు భాషల్లో సినిమాలు రూపొందాయి. ఇప్పుడు భారతీయ ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా దీన్ని తెరకెక్కించినట్లు చిత్రబృందం తెలిపింది. మరోవైపు అగ్ర కథానాయకుడు ఆమీర్‌ ఖాన్‌తో కలసి 'లాల్‌సింగ్‌ చద్ధా'లో నటిస్తోంది కరీనా.

ఇదీ చూడండి:ఓటీటీలోకి 'ది కశ్మీర్​ ఫైల్స్'​ అప్పుడే.. వరి పంటతో సుకుమార్‌ చిత్రం

ABOUT THE AUTHOR

...view details