'ఎవడే సుబ్రమణ్యం'తో అందరి దృష్టిని ఆకర్షించి, ‘మహానటి’తో తెలుగు సినిమాను జాతీయస్థాయిలో నిలిపిన డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఆయన నిర్మాతగా వ్యవహరించిన చిత్రం 'జాతి రత్నాలు'. పూర్తిస్థాయి కామెడీ చిత్రంగా దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలను జాతి రత్నాలుగా మార్చిన డైరెక్టర్ అనుదీప్‌తో ఆయన జర్నీ ఎలా సాగింది? ప్రభాస్‌తో చేస్తున్న సినిమా ఎంతవరకూ వచ్చింది, డైరెక్టర్ అనుదీప్‌లోని అమాయకత్వం ఎలా ఉంటుంది? ఇలాంటి విశేషాలన్నీ ఆయన పంచుకున్నారు. మరి ఆలస్యమెందుకు చదివేయండి!
అనుదీప్‌ను నేనే వెతుక్కుంటూ వెళ్లా..
నాకు జంధ్యాల, ఎస్వీ కృష్ణారెడ్డి గారి సినిమాలంటే చాలా ఇష్టం. అలాంటి క్లీన్ కామెడీ కథలను సినిమాగా తీయాలని ఉండేది. ఆ క్రమంలోనే అయిదారేళ్ల క్రితం అనుదీప్ తీసిన ఒక షార్ట్‌ఫిల్మ్ చూశా. కడుపుబ్బా నవ్వుకునే అమాయకత్వంతో కూడిన హాస్యం ఉంది. దాంతో అతన్ని వెతికి పట్టుకుని సినిమా తీయాలనుకున్నా. ఆయన రెండు మూడు ఐడియాలు చెప్పారు. చివరిగా ‘జాతిరత్నాలు’ ఫైనల్ చేశాం. ఇలాంటి హ్యుమర్ ఉన్న సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తాయి. అనుదీప్‌కు కొన్ని సలహాలు, సూచనలు మాత్రమే ఇచ్చాను.
నవీన్ ఎప్పుడూ నా మైండ్‌లో ఉంటాడు..
‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’కి పని చేస్తున్నప్పటి నుంచి నాకు విజయ్ దేవరకొండ, నవీన్ పొలిశెట్టి తెలుసు. అసలు ముందు ‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రాన్ని చిన్న బడ్జెట్‌లో వీరిద్దరినీ పెట్టి తెరకెక్కిద్దామనుకున్నాం. కానీ కుదరలేదు. రెండేళ్ల ముందు నుంచే ‘జాతి రత్నాలు’ కథతో ట్రావెల్ అయ్యాం. ఈ టైంలోనే నవీన్‌కు ‘ఏజెంట్ సాయి..’ చిత్రంతో మంచి బ్రేక్ వచ్చింది. ముందు నుంచి ఈ కథకు నవీన్ నా మైండ్‌లో ఉన్నాడు. అతనికి తోడు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ తోడయ్యాక హాస్యానికి కొదవేముంటుంది. అందుకే ఈ ముగ్గురూ మా జాతిరత్నాలయ్యారు. ముగ్గురు సిల్లీ ఫెలోస్ ఒక సీరియస్ క్రైమ్‌లో ఇరుక్కుంటే ఎలా ఉంటుందనేది ఎంతో హాస్యంగా చూపిస్తాం.
అప్పట్లో ‘మనీ’ ‘అనగనగా ఒక రోజు’..ఇప్పుడు ‘జాతి రత్నాలు’
ఒకలాంటి అమాయకత్వంతో కూడిన కామెడీ ఎప్పుడూ ఆహ్లాదకరంగా ఉంటుంది. అప్పట్లో వచ్చిన ‘మనీ’ ‘అనగనగా ఒకరోజు’ లాంటి కామెడీ మా చిత్రంలోనూ కనిపిస్తుంది. ఈ సినిమాకు అనుదీప్ మొదట ‘ఆణిముత్యాలు’ ‘సుద్దపూసలు’ అనే టైటిల్స్ సూచించాడు. చివరకు ‘జాతి రత్నాలు’అనుకున్నాం.
నిర్మాతలాగే వ్యవహరించా..
ఒక డైరెక్టర్ నిర్మాతగా మారినప్పుడు కొన్ని లెక్కలు ఉంటాయి. ముఖ్యంగా షాట్స్ పెట్టేటప్పుడు మన విజన్‌ను కూడా డైరెక్టర్‌తో చర్చిస్తాం. అయితే ఈ సినిమా విషయంలో అనుదీప్ స్టైల్లో టేకింగ్ ఉండాలనే ఉద్దేశంతో ఎక్కడా పెద్దగా జోక్యం చేసుకోలేదు. సెట్‌కి వెళ్లినప్పుడు చిన్న చిన్న సలహాలు, సూచనలు ఇచ్చేవాడినంతే. ఈ సినిమా ద్వారా చాలామంది కొత్తవాళ్లను పరిచయం చేశాం. హీరోయిన్ ఫరీదాకు మంచి కామెడీ టైమింగ్ ఉంది. ఆమె అనుకోకుండా ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికయ్యింది.
కచ్చితంగా సందేశాత్మకంగానే ఉంటుంది..
ఇన్ని వందల మంది, ఇంత కష్టంతో సినిమా చేస్తున్నప్పుడు సినిమా అంటే ఏదో కాలక్షేపానికి తీసేది కాదు. కచ్చితంగా కామెడీతో పాటు సమాజానికి అవసరమయ్యే విషయాలను కూడా కథలో చెప్తాం. మొదట అనుదీప్ పూర్తి కామెడీగా తీద్దామన్నారు. నేను కొన్ని సలహాలు ఇచ్చి కథలో కొంచెం కొత్తదన్నాన్ని తీసుకొచ్చాం.