యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా రామాయణ ఇతిహాస నేపథ్యంలో 'ఆదిపురుష్' అనే చిత్రం తెరకెక్కుతోంది. ఓంరౌత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా కోసం ముంబయిలో రెండు భారీ సెట్లు నిర్మించి షూటింగ్ కూడా జరిపారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా మహారాష్ట్రలో షూటింగ్స్ నిలిచిపోయాయి. దీంతో మల్లగుల్లాలు పడిన చిత్రబృందం.. మిగతా షూటింగ్ హైదరాబాద్‌లో పూర్తి చేయాలని భావించింది. అయితే ప్రభాస్ చెప్పిన ఓ మాట వినుంటే చిత్రబృందానికి ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని తెలుస్తోంది.
ప్రభాస్ మాట వినుంటే 'ఆదిపురుష్'కు నష్టం తప్పేదా? - ఆదిపురుష్ చిత్రబృందానికి ప్రభాస్ సలహా
'ఆదిపురుష్' చిత్రీకరణ ప్రారంభంలోనే దర్శకుడు ఓంరౌత్‌కు ఓ సలహా ఇచ్చాడట ప్రభాస్. అది పాటించి ఉంటే ఇప్పుడు చిత్రబృందానికి బడ్జెట్ విషయంలో పెద్ద తలనొప్పి తప్పేదని తెలుస్తోంది.
అదేంటంటే.. ప్రభాస్‌కు ముంబయిలో షూటింగ్ అస్సలు ఇష్టం లేదట. ఈ చిత్రీకరణను హైదరాబాద్‌లో నిర్వహిస్తే బాగుంటుందని చిత్రీకరణ ప్రారంభంలోనే దర్శకుడు ఓంరౌత్‌కు సలహా కూడా ఇచ్చాడట యంగ్ రెబల్‌స్టార్. కానీ ఓంరౌత్ మాత్రం తాను నిర్ణయించిన ప్రకారం ముంబయిలోనే రెండు భారీ సెట్లలో షూటింగ్ పూర్తి చేయాలని భావించాడట. ఇక ఆ తర్వాత కరోనా రావడం.. అక్కడ చిత్రీకరణ నిలిచిపోయడం.. మళ్లీ చిత్రబృందం హైదరాబాద్ వైపు చూడటం జరిగిపోయాయి. ఒకవేళ ప్రభాస్ చెప్పిన మాట వినుంటే.. భారీ బడ్జెట్‌తో రెండుసార్లు సెట్లు నిర్మించే పని తప్పేది కదా? అని తలపట్టుకుంటోదట చిత్ర యూనిట్.
'ఆదిపురుష్' కోసం ముంబయి ఫిల్మ్‌సిటీతో పాటు బయట రెండు భారీ సెట్లు నిర్మించారు. విజువల్ ఎఫెక్ట్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉన్న ఈ చిత్రం కోసం సెట్లకూ ఎక్కువ ఖర్చే అయిందట. తప్పని పరిస్థితుల్లో మరోసారి ఆ రెండు భారీ సెట్లను హైదరాబాద్‌లో నిర్మించాల్సి వస్తోంది. ప్రస్తుతం ఈ పనిలో నిమగ్నమైంది చిత్రబృందం. తాజాగా గురువారం నుంచి తెలంగాణలోనూ లాక్డౌన్ అమలులోకి రానున్న పరిస్థితిల్లో వీరు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో చూడాలి.