బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌తో సినిమా గురించి నటి పూజా హెగ్డే స్పందించింది. త్వరలో ఆమె సల్మాన్‌తో కలిసి 'కబీ ఈద్ కబీ దివాలీ' చిత్రంలో నటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా పూజాను ఓ ఆంగ్ల పత్రిక ఇంటర్వ్యూ చేయగా.. సల్మాన్‌తో నటించాల్సి ఉన్న సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.
"సల్మాన్ ఖాన్‌తో పనిచేయడమంటే మనలోని టాలెంట్‌కు ఇంకొంచెం మెరుగులద్దుకోవాలని అర్థం. ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన సినిమాల్లో ఉన్నారు. ఆయనకు ఎంతో అనుభవం ఉంది. అందువల్లే నేను కొంచెం భయపడుతున్నా. అగ్ర నటీనటులతో నటించే సమయంలో ఇలాగే ఉంటుందేమో. కానీ ఎన్నో మెళకువలు నేర్చుకోవడానికి ఇదో మంచి అవకాశం. ఈ కథ చాలా కూల్, ఫన్నీగా ఉంటుంది. ఆగస్టు నుంచి సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. కాకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలను రీషెడ్యూల్ చేయాలని భావిస్తున్నారు."