సంక్రాంతి సూపర్ హిట్‌గా నిలిచిన 'అల.. వైకుంఠపురములో' చిత్ర విషయంలో త్రివిక్రమ్ ఓ సరికొత్త పంథాను ఎంచుకుని లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఇంతకీ అతడు ఎంచుకున్న ఆ మార్గం మరేదో కాదు.. మూడు నెలలు ముందు నుంచే ఒక్కొక్కటిగా పాటలు విడుదల చేయటమే. ఇందులోని తొలి గీతం 'సామజవరగమన..'ను సినిమా విడుదలకు దాదాపు మూడు నెలల ముందుగానే ప్రేక్షకులకు చేరవేశారు. ఈ స్ట్రాటజీనే చిత్ర విజయంలో చాలా కీలకంగా మారింది.
ఇప్పుడీ చిత్ర విజయాన్ని స్ఫూర్తిగా తీసుకునే పవన్ కల్యాణ్ 'పింక్' రీమేక్ నుంచి దాదాపు రెండు నెలలు ముందుగానే తొలి పాటను విడుదల చేయనున్నట్టు సంకేతాలు అందుతున్నాయి. తాజాగా ఈ చిత్ర స్వరకర్త తమన్ తన ట్వీట్ ద్వారా ఈ అంశంపై చిన్న క్లూ ఇచ్చేశాడు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత పవన్ నుంచి వస్తోన్న సినిమా కావడం వల్ల దీనిపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే ఈ క్రేజ్‌ను మరింత స్థాయికి తీసుకెళ్లాలా ముందుగానే గీతాల్ని విడుదల చేస్తే.. చిత్ర విడుదల సమయానికి ప్రచారభారం చాలా వరకు తగ్గుతుందని దిల్‌రాజు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
దాదాపు రెండు నెలల క్రితమే తమన్‌కు త్వరితగతిన పాటలు పూర్తి చేయాలని ఆదేశాలిచ్చేశాడట దిల్‌రాజు. ఇప్పటికే ఓ పాట రికార్డింగ్ పూర్తయినట్లు సమాచారం. సినిమాలోని ఈ కీలక పాటను యువ సంచలనం సిద్ శ్రీరామ్ ఆలపించినట్లు తెలుస్తోంది. త్వరలో విడుదల కాబోయే తొలి పాట ఇదేనని చిత్రసీమలో ప్రచారం జరుగుతోంది. మరికొద్ది రోజుల్లోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.