కెరీర్ ప్రారంభంలో తానూ ట్రోల్స్ బారినపడ్డట్లు వెల్లడించింది బాలీవుడ్ హీరోయిన్ అనన్యా పాండే. కొందరు తన శరీరాకృతిపై కామెంట్లు చేసేవారని తెలిపింది. తన శరీరం అబ్బాయిల్లా ఉండేదని అంటుంటే ఎంతో బాధగా ఉండేదని చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది.
"నాకు సరిగా గుర్తులేదు. కానీ నేను మా పేరెంట్స్‌తో దిగిన ఫొటో అది. అప్పటికీ నేను నటిని కాదు. ఆ ఫొటో చూసి నేను చాలా సన్నగా ఉన్నా, నన్ను అందరూ అబ్బాయిలా ఉన్నావని అంటున్నారు అని మా తల్లిదండ్రులకి చెప్పా. అలా వారు విమర్శించినపుడు చాలా బాధగా అనిపించేది. ఎందుకంటే కెరీర్లో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాల్సిన సమయంలో ఇలాంటి ట్రోల్స్ మనల్ని బలహీనుల్ని చేస్తాయి. ఆ తర్వాత విమర్శల్ని తేలికగా తీసుకోవడం మొదలుపెట్టా. ప్రారంభంలో అలాంటి మాటలు బాధపెట్టినా.. ఆ తర్వాత ఎంజాయ్ చేశా."