దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులపై పెన్ స్టూడియోస్ ఓ అధికార ప్రకటన చేసింది. వీటిని సొంతం చేసుకున్న పలువురు భాగస్వాముల గురించి ఓ వీడియో ద్వారా వెల్లడించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 ఓటీటీ సొంతం చేసుకోగా.. సినిమా హిందీ వర్షెన్‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది.
మరోవైపు శాటిలైట్ విభాగంలో తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో 'ఆర్ఆర్ఆర్' సినిమా హక్కులను స్టార్ నెట్వర్క్ సొంతం చేసుకోగా.. మలయాళంలో ఏసియంట్, హిందీలో జీ నెట్వర్క్ హక్కుదారుగా ఉన్నాయి. ఇతర దేశాల భాషలైన ఇంగ్లీష్, పోర్చుగీస్, కొరియన్, టర్కీష్, స్పానిష్‌లలో నెట్‌ఫ్లిక్స్ డిజిటల్ వేదికలో ప్రసారం చేయనుంది. అదే విధంగా ఈ సినిమాకు సంబంధించిన హిందీ థియేట్రికల్ హక్కులను పెన్ మరూధర్ సినీ ఎంటర్టైన్మెంట్స్(పెన్ స్టూడియోస్) సొంతం చేసుకుంది.