రోషన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'పెళ్లిసందD'(pelli sandadi movie release date). గౌరి రోనంకి దర్శకురాలు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు(pelli sandadi 2021 trailer).. ఈ చిత్రంతోనే నటుడిగా పరిచయమవుతున్నారు. ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకొస్తోందీ చిత్రం. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించాడు రోషన్. మూవీ గురించి పలు ఆసక్తికర సంగతులను తెలిపాడు. అవన్నీ అతడి మాటల్లోనే..
"చిత్ర పరిశ్రమలో మనం అనుకుంటే అయ్యేవి తక్కువ అని, కొన్ని ఫ్లోలో జరిగిపోతుంటాయని మా నాన్న చెబుతుంటారు. నా సినీ ప్రయాణంలోనూ అదే జరిగింది. అనుకోకుండానే 'నిర్మలా కాన్వెంట్'(nirmala convent movie) చేసే అవకాశం వచ్చింది. టీనేజ్‌లో చేసిన సినిమా అది. ఇక కె.రాఘవేంద్రరావు సర్‌తో సినిమా అస్సలు అనుకోలేదు. అనుకోకుండానే ఆయన్నుంచి 'పెళ్లిసందD' కోసం పిలుపొచ్చింది. తొలి సినిమా సమయానికి నేనొక బాలనటుడిగానే లెక్క. పూర్తిస్థాయిలో హీరోగా నేను పరిచయం అవుతున్న సినిమా అంటే ఇదే. రాఘవేంద్రరావు సర్‌తో సినిమా ఓ అదృష్టం అనుకుంటే, మా నాన్న చేసిన 'పెళ్లిసందడి' సినిమా పేరుతోనే, అది కూడా సరిగ్గా పాతికేళ్ల తర్వాత నేను చేయడం అంటే అంతా ఒక కలలా ఉంది. నేటితరం మొదలుకొని, కుటుంబ ప్రేక్షకుల వరకు అందరికీ నచ్చేలా ఉంటుందీ చిత్రం. కరోనా తర్వాత ఇప్పుడున్న పరిస్థితులకి తగ్గట్టు వినోదాన్ని అందించే చిత్రమిది. తొలి అడుగుల్లోనే ఇలాంటి ఓ కుటుంబ కథ చేయడం ఓ మంచి అనుభవం".
"అమ్మానాన్నలు నటులే అయినా, మా ఇంట్లో సినిమా వాతావరణం అంతగా కనిపించేది కాదు. అప్పుడప్పుడు నాన్నతో కలిసి వేడుకలకి వెళ్లడం తప్ప! స్నేహితులు కూడా బయటవాళ్లే ఎక్కువ. నాన్నకి క్రికెట్ అంటే ఇష్టం. ఆయన నన్నొక క్రికెటర్‌లా చూడాలనుకునేవారు. అందుకే అటువైపు ప్రోత్సహించారు. నేను కూడా చిన్నప్పుడు క్రికెట్ బాగా ఆడేవాణ్ని.
అలా అండర్ 14 జట్టుకి రాష్ట్ర స్థాయిలో ఆడాను. రోజూ ఎంతో క్రమశిక్షణతో ఉదయాన్నే జింఖానా గ్రౌండ్‌కి వెళ్లి అక్కడ క్రికెట్ ఆడేవాణ్ని. ఒకదశలో క్రికెటర్‌గా రాణించాలంటే ఈ కష్టం సరిపోదేమో అనిపించింది. ఆ సమయంలోనే 'నిర్మలా కాన్వెంట్' చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అప్పట్నుంచి సినిమాపై ప్రేమ పుట్టింది. చదువుల్లో నేను అంత చురుకేమీ కాదు. 75 శాతం మార్కులొచ్చేవి. మా చెల్లి చాలా బాగా చదువుతుంది. మా తమ్ముడు నాకంటే బాగా చదువుతాడు. నేను అంతంత మాత్రమే. దాంతో ఏడాదికి మూడుసార్లు ప్రోగ్రెస్ కార్డ్ చేతికి ఇచ్చినప్పుడంతా ఇంట్లో గట్టిగా క్లాస్ పడేది. ఇంటర్ తర్వాత ఇక సినిమాపైనే దృష్టిపెడతానని ఇంట్లో చెప్పా. దాంతో అమెరికా, లాస్ ఏంజెలిస్‌లోని ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేర్పించారు. అక్కడ ఒక ఏడాది డిప్లొమా పూర్తి చేసి తిరిగొచ్చా. సల్మాన్‌ఖాన్ నిర్మాణ సంస్థలో 'దబాంగ్ 3'కి సహాయ దర్శకుడిగా పనిచేశా. అక్కడ తెర వెనక జరిగే ప్రక్రియనంతా క్షుణ్ణంగా అధ్యయనం చేశా. ఆ సినిమా ప్రయాణంలో సల్మాన్‌ఖాన్ నుంచి కూడా చాలా విషయాలు తెలుసుకున్నా".