అద్భుతమైన దృశ్య కావ్యాలను తెరకెక్కించడంలో బాపు-రమణలు సిద్ధహస్తులు. వారి చిత్రాలు చూస్తుంటే వాస్తవానికి దగ్గరగా అనిపిస్తాయి. అంత హృద్యంగా రూపొందిస్తారు. 'పెళ్లిపుస్తకం' (1991) సినిమా షూటింగ్ జరుగుతోంది. రాధాకుమారి, సాక్షి రంగారావు బాదం ఆకుల విస్తర్లలో ఇడ్లీలు తింటూ మాట్లాడుకుంటున్నట్లు రమణ స్క్రిప్టు రాశారు. షాట్స్ రాసినప్పుడు దర్శకుడు బాపు కూడా అదే రాసి, 'బాదం ఆకుల విస్తర్లు కావాలి' అని, ప్రొడక్షన్ వాళ్లకు చెప్పారు. షూటింగ్ ఉదయం ఆరంభమైంది. బాదం ఆకులు దొరకలేదని, మామూలు విస్తరాకులు తెచ్చారు ప్రొడక్షన్ వాళ్లు.
'అదేమిటండీ, బాదం ఆకులు దొరక్కపోడం ఏమిటి? ఏమేం కావాలో మన వాళ్లు నిన్న పొద్దున్నే రాసి ఇచ్చారు కదా! బాదం ఆకుల విస్తర్లే కావాలి. వెళ్లి తీసుకురండి. ఇంతపెద్ద హైదరాబాద్‌లో ఎవరింట్లోనూ బాదం చెట్టు లేదా?' అని కసిరి పంపించారు బాపు. అవి వచ్చేవరకూ షూటింగ్ జరగలేదు! (సినిమా నిర్మాతలు వాళ్లే గనక సరిపోయింది) ఫలానా ప్రాంతంలో బాదం చెట్టు ఉందంటే, రెండు కార్లు వేసుకుని అటూ ఇటూ తిరగడం మొదలు పెట్టారు. ఆఖరికి చిక్కడపల్లిలో ఒకరింట్లో బాదం చెట్టు ఉందని ఎవరో చెబితే, అక్కడికి వెళ్లి ఆకులు కోసి తెచ్చి, విస్తర్లు కుట్టి ఇచ్చేసరికి, మధ్యాహ్నమైంది.