బాలీవుడ్లో విజయవంతమైన 'పింక్' చిత్రానికి రీమేక్‌గా పవన్ కల్యాణ్ నటించిన చిత్రం 'వకీల్ సాబ్'. వేణుశ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రచారాన్ని మొదలుపెట్టిన దర్శక నిర్మాతలు.. ట్రైలర్‌ను భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇప్పటికే ప్రచార చిత్రానికి సంబంధించి డబ్బింగ్ పనులను పూర్తి చేసిన పవన్ కల్యాణ్.. ఈ ట్రైలర్‌ను సామాజిక మాధ్యమాల్లో కాకుండా మొదట నేరుగా థియేటర్లలో విడుదల చేయాలని సూచించారని తెలుస్తోంది. పవన్ సూచనల మేరకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి థియేటర్లో మార్చి 29న సాయంత్రం 5.30గంటలకు 'వకీల్ సాబ్' ప్రచార చిత్రాన్ని ఏకకాలంలో విడుదల చేసేందుకు చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.