సినీ కార్మికుల కోసం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన చిరంజీవికి తమ్ముడిగా ఉన్నందుకు తాను ఎంతో గర్వపడుతున్నానని సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నాడు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్(కొవిడ్-19) వ్యాపిస్తోన్న తరుణంలో ఆ మహమ్మారిని కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం 21 రోజులపాటు లాక్‌డౌన్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో పనుల్లేక చాలామంది పేద కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి.
ఈ క్రమంలో పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు ముందుకు వచ్చి కరోనాపై అలుపెరగని పోరాటాన్ని చేస్తోన్న రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు తమవంతు విరాళాన్ని ప్రకటించారు. సాయం చేసిన సినీ ప్రముఖులందరినీ పవన్‌కల్యాణ్ ట్విట్టర్లో అభినందించాడు.
'పెద్దన్నయ్య పెద్ద మనస్సు..'
"సినిమా పరిశ్రమకు ఎటువంటి కష్టం వచ్చినా తక్షణమే స్పందించే నా పెద్దన్నయ్య చిరంజీవి సినీ కార్మికుల కోసం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించినందుకు ఆయన తమ్ముడిగా గర్వపడుతున్నా. సినిమా పరిశ్రమకు చెందిన 24 విభాగాలలోని ప్రతి టెక్నీషియన్, ప్రతి కార్మికుడి శ్రమ తెలిసిన వ్యక్తి చిరంజీవి. సినిమానే నమ్ముకుని జీవిస్తూ కరోనా దెబ్బకు ఉపాధి కోల్పోయిన ఎందరో కార్మికులు, టెక్నీషియన్లు ఆర్థికంగా అల్లాడిపోతున్నారు. అటువంటి వారిని ఆదుకోవడానికి పెద్దన్నగా ముందుకు వచ్చిన చిరంజీవికి నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలని నిర్ణయించుకున్న ఆయన దయార్ద్ర హృదయానికి జేజేలు పలుకుతున్నాను."
ప్రభాస్ పెద్ద మనసు..
"రూ.4 కోట్ల భూరి విరాళాన్ని ప్రకటించి ప్రభాస్ తన పెద్ద మనస్సును చాటుకున్నాడు. సమాజ క్షేమం గురించి ఆలోచించే మహేశ్‌బాబు రూ.కోటి ఇచ్చి సమాజం పట్ల తనకున్న ఆపేక్షను వ్యక్తం చేశాడు. నా అన్న కుమారుడు రామ్‌చరణ్.. తన తండ్రి అడుగుజాడల్లోనే పయనిస్తూ తనకంటూ ఓ సేవాభావాన్ని పెంపొందించుకుంటూ రూ.75 లక్షల రూపాయల విరాళాన్ని ఇచ్చి యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. మరో యువ శక్తి తారక్(ఎన్టీఆర్) రూ.70 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించడం ముదావహం."