తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'భీమ్లానాయక్​'ను ఎంతో బాధ్యతగా చేశా: పవన్​కల్యాణ్​ - భీమ్లానాయక్​ ప్రీ రిలీజ్ ఈవెంట్​

'భీమ్లానాయక్'​ సినిమాలో ఎంతో బాధ్యతగా నటించినట్లు తెలిపారు హీరో పవన్​కల్యాణ్​. ఈ మూవీ కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రం ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Bheemlanayak Pre release event
భీమ్లానాయక్​ ప్రీ రిలీజ్ ఈవెంట్​

By

Published : Feb 24, 2022, 6:34 AM IST

Bheemlanayak Pre release event: "సినిమానే నాకు డబ్బు సంపాదించుకునే వృత్తి. 'తొలి ప్రేమ', 'ఖుషీ' తదితర సినిమాలు ఎంత బాధ్యతగా చేశానో, ప్రజాజీవితంలో ఉంటూనే అంతే బాధ్యతగా చేసిన సినిమా 'భీమ్లానాయక్​'. అహంకారానికీ, ఆత్మగౌరవానికీ మధ్య మడమ తిప్పని యుద్ధమే ఈ సినిమా. కచ్చితంగా ప్రేక్షకుల్ని ఆనందపరుస్తుంది. నేను ఆప్యాయంగా రామ్‌ భాయ్‌ అని పిలుచుకునే కేటీఆర్‌ను ఆహ్వానించగానే మన్నించి ఈ వేడుకకు వచ్చారు. చిత్ర పరిశ్రమకు రాజకీయాలు ఇమడవు. నిజమైన కళాకారుడికి కులం మతం ప్రాంతం అనేవి పట్టవు. చెన్నైలో ఉండిపోయిన చిత్ర పరిశ్రమని ఉమ్మడి రాష్ట్రానికి రాజధానిగా ఉన్నప్పుడు అనేకమంది పెద్దలు కలిసి హైదరాబాద్‌కి తీసుకొచ్చారు. ఈరోజు దాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరింత ముందుకు తీసుకెళ్లేలా ప్రోత్సాహాన్ని అందిస్తున్నందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. చిన్నపాటి అవసరం ఉందంటే మంత్రి తలసాని ముందుంటారు. దానం నాగేందర్‌, మాగంటి గోపీనాథ్‌కి ధన్యవాదాలు చెబుతున్నా" అని అన్నారు హీరో పవన్​కల్యాణ్​. బుధవారం రాత్రి హైదరాబాద్‌లో 'భీమ్లానాయక్‌' ప్రీ రిలీజ్​ ఈవెంట్​ హైదరాబాద్​లో జరిగింది. ఈ కార్యక్రమంలోనే పవన్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

Bheemlanayak Rana: రానా దగ్గుబాటి మాట్లాడుతూ "ఈ సినిమా కోసం చాలామంది మేధావులతో కలిసి పనిచేశా. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలు ఒకలా ఉంటే, ఇకపై పవన్‌ కల్యాణ్‌ ప్రభావంతో మరోలా ఉంటాయి. భారతీయ సినిమాకి హైదరాబాద్‌ రాజధానిగా మారడం ఖాయం" అన్నారు.

Bheemlanayak Director: సాగర్‌ కె.చంద్ర మాట్లాడుతూ "కొన్నేళ్ల కిందట పవన్‌కల్యాణ్‌ను చూసేందుకని 'పంజా' పాటల వేడుకకి వెళ్లా. ఆ స్థానం నుంచి ఆయన సినిమాకు దర్శకత్వం చేసే స్థాయికి చేరడం అనిర్వచనీయమైన అనుభూతి. రానా దగ్గుబాటి ఎప్పుడూ అదే ఉత్సాహంతో పనిచేస్తుంటారు. నిర్మాతలు నాగవంశీ, చినబాబు, త్రివిక్రమ్‌... ఇలా నా చుట్టూ ఉన్న మంచి వ్యక్తులే నాకు ఈ అవకాశం రావడానికి కారణమయ్యార"న్నారు.

తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖమంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్‌ మాట్లాడుతూ.. "భారతీయ చలన చిత్ర పరిశ్రమకి హైదరాబాద్‌ సుస్థిరమైన కేంద్రం కావాలనే సంకల్పంతో... ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో మేమంతా పనిచేస్తున్నాం. అది కచ్చితంగా సాధిస్తామనే సంపూర్ణ విశ్వాసం మాకు ఉంది. పవన్‌ కల్యాణ్‌ మంచి మనసున్న మనిషి. 25, 26 ఏళ్లపాటు ఒకే రకమైన స్టార్‌ డమ్‌ను, ఫ్యాన్‌ పాలోయింగ్‌ను పొందడం అసాధారణమైన విజయం. మొగిలయ్య, దుర్గవ్వలాంటి అజ్ఞాతసూర్యుల్ని వెలుగులోకి తీసుకొచ్చిన పవన్‌కల్యాణ్‌కి, ఈ చిత్రబృందానికి నా కృతజ్ఞతలు. నల్గొండ నుంచి వచ్చి పవన్‌కల్యాణ్‌ సినిమాకు దర్శకత్వం చేసిన సాగర్‌ కె.చంద్రకి శుభాకాంక్షలు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అతిముఖ్యమైన మల్లన్నసాగర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. చిత్రీకరణలు గోదావరి జిల్లాలతోపాటు, తెలంగాణలోని మల్లన్న సాగర్‌, కొండ పోచమ్మసాగర్‌ లాంటి ప్రదేశాల్లోనూ చేయొచ్చు" అన్నారు.

తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మాట్లాడుతూ "పరిశ్రమ బాగుండాలి, పరిశ్రమలో ఉండే అందరూ బాగుండాలి, 24 విభాగాలకి చెందిన లక్షలాది మంది కార్మికులు, ప్రజలు బాగుండాలని ప్రభుత్వం కోరుకొంటోంది" అన్నారు.

సినిమా విజయవంతం కావాలని ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్‌, దానం నాగేందర్‌ కోరుకున్నారు. పద్మశ్రీ పురస్కారం పొందిన ప్రముఖ గాయకుడు, కిన్నెర కళాకారుడు మొగిలయ్యకి, జానపద గాయకురాలు దుర్గవ్వకి ఈ వేదికపై సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో త్రివిక్రమ్‌, సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు), రవి కె.చంద్రన్‌, రామజోగయ్యశాస్త్రి, సంయుక్త మేనన్‌, కాసర్ల శ్యామ్‌, ఎ.ఎస్‌.ప్రకాశ్‌, విజయ్‌ మాస్టర్‌, గణేష్‌ మాస్టర్‌, పీడీవీ ప్రసాద్‌, సాయికృష్ణ, విజయ్‌ భాస్కర్‌ పాల్గొన్నారు. కాగా, భీమ్లానాయక్​ సినిమాలో రానా దగ్గుబాటి ముఖ్యభూమిక పోషించారు. సాగర్‌ కె.చంద్ర దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది.

ఇదీ చూడండి: 'భీమ్లా నాయక్' కొత్త ట్రైలర్.. పవన్-రానా రచ్చ

ABOUT THE AUTHOR

...view details