పవన్ కల్యాణ్, మహేశ్ బాబు.. వీరిద్దరూ టాలీవుడ్లో అగ్రహీరోలుగా వెలుగొందుతున్నారు. వీరివురూ కలిసి ఓ సినిమాలో నటించాలని చాలా మంది అభిమానులు కోరుకుంటూ ఉంటారు. పవన్, మహేశ్ ఏదైనా సందర్భంలో కలిసినా, ఒకరి పేరు మరొకరి నోటి వెంట వినిపించినా సంబరపడిపోతుంటారు. తాజాగా దీపావళి సందర్భంగా ఇరు హీరోల అభిమానులకు ఇలాంటి ఆనందమే కలిగింది.
మహేశ్ ఫ్యామిలీకి పవన్ దీపావళి కానుక - హరీశ్ శంకర్ కు పవన్ దీపావళి కానుకలు
దీపావళి సందర్భంగా పలువురు సినీ ప్రముఖులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ గిఫ్ట్‌లు పంపించారు ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్. సూపర్ స్టార్ మహేశ్ ఫ్యామిలీకి కూడా ఈ బహుమతి పంపారు. దీంతో దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
దీపావళి పండగ పురస్కరించుకుని పలువురు సినీ ప్రముఖులకు కానుకలు పంపారు పవన్ కల్యాణ్. అలాగే మహేశ్ కుటుంబానికి ఈ గిఫ్ట్ అందించారు. ఇందులో పర్యావరణానికి హాని చేయని టపాసులతో పాటు స్వీట్లు ఉన్నాయి. ఈ విషయాన్ని మహేశ్ సతీమణి నమ్రత సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేసింది. కానుకలు పంపినందుకు పవన్‌కు ధన్యవాదాలు తెలిపింది. ఇది చూసిన అభిమానులు గాల్లో తేలిపోతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు పవన్. 'భీమ్లా నాయక్', హరిహర వీరమల్లు చిత్రాల షూటింగుల్లో పాల్గొంటున్నారు. ఇక మహేశ్ 'సర్కారు వారి పాట' చిత్రీకరణను ముగించే పనిలో ఉన్నారు.